పార్సల్ కోసం కస్టమర్ ఇంట్లోనే ఎదురుచూస్తున్నప్పటికీ, ఇంటికి ఎవరూ అందుబాటులో లేరంటూ కొరియర్ ట్రాకింగ్‌లో తప్పుడు సమాచారం నమోదు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నిర్లక్ష్యపు విధానాల వల్ల కస్టమర్లతో పాటు విక్రేతలు, కంపెనీలు కూడా నష్టపోతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రణవ్ భరద్వాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. పార్సల్ కోసం తాను ఇంట్లోనే ఎదురుచూస్తున్న ఫొటోతో పాటు, బ్లూ డార్ట్ కొరియర్ ట్రాకింగ్‌లో ‘ఇల్లు మూసి ఉంది’ అని చూపిస్తున్న స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. డెలివరీ చేయడానికి అవసరమైతే ఉద్యోగిని తీసుకురావడానికి కారు, డ్రైవర్‌ను కూడా పంపిస్తానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
నవంబర్ 16న ఈ సమస్యపై తొలిసారిగా పోస్ట్ చేసిన ఆయన.. వరుసగా మూడు రోజుల నుంచి పార్సల్ డెలివరీకి బయలుదేరినట్లు ట్రాకింగ్‌లో కనిపిస్తున్నప్పటికీ, డెలివరీ సిబ్బంది తమ నివాస ప్రాంతానికి రాకుండానే రోజు చివర్లో ఇంటికి తాళం వేసి ఉందంటూ అప్డేట్ చేస్తున్నారని ఆరోపించారు.
తాను నివసించే అపార్ట్మెంట్లోకి రావడానికి భద్రతా అనుమతి అవసరమైనప్పటికీ, డెలివరీ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా ఇంటి బయట ప్రత్యేకంగా పార్సల్ ర్యాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్సల్ అందిన తర్వాతే డబ్బులు చెల్లించే విధానంలో ఆర్డర్ చేసినందున తనకు పెద్దగా తొందర లేకపోయినా, అసలు ఇంటికి రాకుండానే తప్పుడు సమాచారం నమోదు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి ఘటనల వల్ల కస్టమర్లతో పాటు విక్రేతలు, వ్యాపార సంస్థలు కూడా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. డెలివరీ సిబ్బంది పనితీరును సంబంధిత కంపెనీలు సక్రమంగా పర్యవేక్షిస్తున్నాయా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన బ్లూ డార్ట్ సంస్థ, కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, నేరుగా సంప్రదించి సమస్యపై స్పందించినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా, పలువురు నెటిజన్లు కూడా తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. పెట్రోల్ ఖర్చులు వంటి కారణాలతో కొందరు డెలివరీ సిబ్బంది పార్సళ్లను అందించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. మరికొందరు తమ క్రెడిట్ కార్డులు 15 రోజులుగా డెలివరీ కాకుండా ఉన్నాయని, రాత్రి 10 గంటల తర్వాత కూడా డెలివరీకి బయలుదేరినట్లు చూపించి, చివరకు ఇంట్లో ఎవరూ లేరంటూ అప్డేట్ చేస్తున్నారని వాపోయారు.
ఈ ఘటనతో కొరియర్ సేవల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానం ఎంత ముఖ్యమనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కస్టమర్లకు సరైన సమాచారం అందించడంతో పాటు, డెలివరీ సిబ్బంది పనితీరుపై కంపెనీలు మరింత పర్యవేక్షణ చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Leave a Reply