ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్లో ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమవుతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో దాదాపు 10 కోట్ల ఎర్ర పీతలు అడవుల నుంచి సముద్ర తీరం వైపు భారీ సంఖ్యలో వలస ప్రయాణం ప్రారంభించాయి. వేలాది కాదు.. లక్షలాది కాదు.. కోట్ల సంఖ్యలో పీతలు ఒకేసారి కదులుతుండటంతో అక్కడి రహదారులు, అడవి మార్గాలు ఎర్రటి రంగులో కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిస్మస్ ఐలాండ్లో ప్రతి సంవత్సరం ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. సంతానోత్పత్తి కోసం అడవుల్లో నివసించే ఎర్ర పీతలు సముద్రం వైపు ప్రయాణిస్తాయి. అక్కడే గుడ్లు పెట్టేందుకు ఇవి వేల కిలోమీటర్ల ప్రయాణం చేయకపోయినా, తమ నివాస ప్రాంతాల నుంచి తీరానికి చేరుకునేందుకు అనేక అడ్డంకులను దాటాల్సి ఉంటుంది.
ఈ పీతలు భారీ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి ప్రాణాలకు ప్రమాదం కలగకుండా అధికారులు కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. అంతేకాకుండా, పీతలు సురక్షితంగా రోడ్లు దాటేందుకు ప్రత్యేకంగా బ్రిడ్జిలు, మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సమయంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. పీతలు రోడ్లపై గుంపులుగా కదులుతుండటంతో వాహనాలను నెమ్మదిగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పీతల వలసకు అనుగుణంగా స్థానికులు తమ ప్రయాణ ప్రణాళికలను కూడా మార్చుకోవాల్సి వస్తోంది.
ఈ ఏడాది ఈ అరుదైన ప్రకృతి దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. సరైన సమయంలో సముద్ర తీరానికి చేరుకుని, చంద్రుడి దశలు, సముద్రపు ఆటుపోట్లకు అనుగుణంగా గుడ్లు పెట్టడం ఈ పీతల ప్రత్యేకత.
సూర్యరశ్మి, భూమి అయస్కాంత క్షేత్రం వంటి ప్రకృతి సంకేతాలను ఉపయోగించి ఇవి తమ ప్రయాణ దిశను ఎలా గుర్తిస్తున్నాయనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఒకవైపు కోట్లాది పీతలు ఒకేసారి సముద్రం వైపు కదులుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరోవైపు ఈ జీవుల సురక్షిత వలస కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో జీవుల ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ దృశ్యం మరోసారి గుర్తుచేస్తోంది.

Leave a Reply