సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలను మోస్తూ, కళాశాల చదువుతో పాటే ఫుడ్ డెలివరీ పనిలో చేరిన ఓ యువకుడు, నేడు సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థను నడుపుతున్నాడు. ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
గోపీనాథ్ పాండియన్ అనే ఆ యువకుడు ‘గాడ్‌వర్స్ ఏఐ’ (Godverse AI) సంస్థకు అధిపతిగా వ్యవహరిస్తూనే, ప్రభుత్వ మరియు ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులలోనూ పనిచేస్తున్నాడు.
18 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించడానికి తండ్రిని అప్పు అడగ్గా ఆయన నిరాకరించారు. దీంతో ఎవరి ముందు చేయి చాచకుండా స్వశక్తితోనే పెట్టుబడి సమకూర్చుకోవాలనే దృఢ సంకల్పంతో, 2021లో స్విగ్గీ సంస్థలో డెలివరీ పార్ట్‌నర్‌గా చేరాడు.
సమయ స్వేచ్ఛ ఉండటంతో ఈ పనిని ఎంచుకున్న అతను, మనుషులను అర్థం చేసుకోవడానికి, సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడానికి ఈ కాలాన్ని ఒక శిక్షణా వేదికగా ఉపయోగించుకున్నాడు. డెలివరీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో తాను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను కూడా గోపీనాథ్ మనసు విప్పి పంచుకున్నాడు.
ఒకసారి అతని ద్విచక్ర వాహనం అనుకోకుండా ఓ కారుకు తగలగా, కారు యజమాని కోపంగా కిందకు దిగి వచ్చి అతని చొక్కా పట్టుకున్నాడు. అయితే, అతను డెలివరీ ఉద్యోగి అని తెలియగానే, వెంటనే జేబులో నుండి టిష్యూ పేపర్ తీసి తన చేతిని తుడుచుకున్నాడు. ఆ వ్యక్తి చేసిన పని గోపీనాథ్ మనసులో తీవ్రమైన బాధను, గాయాన్ని మిగిల్చింది.
రోడ్లపై కష్టపడే సాధారణ మనుషులను సమాజం ఎలాంటి కోణంలో చూస్తుందో గ్రహించిన అతను, డెలివరీ ఉద్యోగులకు తగిన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.
2022లో కళాశాల చదువు పూర్తి చేసిన వెంటనే, తాను పొదుపు చేసిన డబ్బుతో ప్రారంభించిన మొదటి వ్యాపారం క్రిప్టో మార్కెట్ పతనంతో దెబ్బతిన్నప్పటికీ గోపీనాథ్ కుంగిపోలేదు. ఆ తర్వాత ఓ పెద్ద టెక్నాలజీ సంస్థలో రెండేళ్ల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటాపై పట్టు సాధించి, 2024లో సొంతంగా తన సంస్థను ప్రారంభించాడు.
నేడు ఏడుగురు సభ్యుల బృందాన్ని నడిపిస్తున్న అతను, తాను ఆహారం డెలివరీ చేసిన రోజులనే తన జీవితంలో స్వర్ణయుగంగా గర్వంగా పేర్కొంటున్నాడు.

Leave a Reply