ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందుల పేరుతోనే వారి జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ ఔషధాల ముఠాపై ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్టీఎఫ్) సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టాయి. ప్రముఖ ఔషధ కంపెనీల పేర్లతో నకిలీ మందులు తయారు చేస్తున్న అక్రమ ఫ్యాక్టరీని అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మొరాదాబాద్, లక్నో నగరాల్లో ఇటీవల జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీ మందులు పట్టుబడ్డాయి. దీంతో ఈ మందుల తయారీ వెనుక ఉన్న అసలు ముఠాను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో నలాగఢ్ ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న అక్రమ ఔషధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. వెంటనే అక్కడ దాడులు నిర్వహించారు.
రాజ్‌పురా–ఖేరా బైపాస్ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రముఖ ఔషధ కంపెనీల పేర్లను ఉపయోగించి, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఖరీదైన మందులను ఇక్కడ నకిలీగా తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, నాడీ సంబంధిత వ్యాధులకు ఉపయోగించే మందులు, కడుపులో ఆమ్లత్వాన్ని తగ్గించే మాత్రలను అసలైన మందుల మాదిరిగానే తయారు చేసి, అదే తరహా ప్యాకింగ్‌తో మార్కెట్లోకి పంపిస్తున్నట్లు గుర్తించారు.
ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించిన అధికారులు మాత్రలను ప్యాకింగ్ చేసే యంత్రాలు, అల్యూమినియం ఫాయిల్ ప్యాకింగ్ పరికరాలు, ముద్రించిన మందుల కవర్లు, బరువు కొలిచే యంత్రాలు సహా భారీ సంఖ్యలో పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతకుముందు గత వారం వారణాసిలోని రోహానియా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 17 రకాల నకిలీ మందులు పట్టుబడ్డాయి. వాటిలో కడుపు సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే ప్రముఖ ఔషధాల నకిలీ రూపాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మందులు ఎక్కడ తయారవుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టగా, రాష్ట్రాల మధ్య విస్తరించిన నకిలీ మందుల సరఫరా నెట్‌వర్క్‌కు హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిన ఈ అక్రమ ఫ్యాక్టరీ యజమానులతో పాటు, నకిలీ మందులను పంపిణీ చేస్తున్న వ్యక్తుల కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన మందులే ప్రమాదకరంగా మారే పరిస్థితిని అరికట్టేందుకు నకిలీ ఔషధాల తయారీ, సరఫరా, విక్రయ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించే వరకు తమ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply