ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బ్యాంకు ఉద్యోగి అనురాగ్ శుక్లాపై జరిగిన కాల్పుల ఘటన కేసులో, ఆయన భార్యే సుపారీ గ్యాంగ్‌ను పెట్టి హత్య చేయించేందుకు ప్రయత్నించిన షాకింగ్ నిజం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
గత అక్టోబర్ 28 రాత్రి అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుర్నియా చౌరస్తా సమీపంలో అనురాగ్ శుక్లాపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపగా, ఆయన కుడి చేతిలో తూటా దూసుకెళ్లింది.
అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యాయత్నం వెనుక ఆయన భార్య ఆషి మిశ్రా, పోలీస్ కానిస్టేబుల్ నితిన్ రాణా ఉన్నట్లు విచారణలో తేలింది.
పోలీసుల విచారణ ప్రకారం, 2022లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఓ లైబ్రరీలో ఆషి మిశ్రాకు, ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ నితిన్ రాణాతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది.
ఈ క్రమంలో 2025లో ఆషి మిశ్రాకు అనురాగ్ శుక్లాతో వివాహం జరిగినప్పటికీ, నితిన్ రాణాతో ఆమె సంబంధం కొనసాగింది. భర్త ఇతర మహిళలతో మాట్లాడుతున్నాడంటూ ఆషి తరచూ ఆయనతో గొడవపడేది. ఈ నేపథ్యంలో అనురాగ్‌ను తమ దారిలోంచి తొలగించేందుకు ఆషి, నితిన్ రాణా కలిసి కుట్ర పన్నారు.
ఇందుకోసం నితిన్ రాణాకు తెలిసిన వ్యక్తుల ద్వారా రూ.6 లక్షలకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకున్నారు. రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం అనురాగ్‌పై కాల్పులు జరిపారు. మొదటి ప్రయత్నంలో అనురాగ్ ప్రాణాలతో బయటపడటంతో, మరోసారి ఆయనను హత్య చేసేందుకు నిందితులు పథకం వేస్తుండగా, ప్రత్యేక పోలీసు బృందాలు వేగంగా స్పందించి మీరట్, లక్నో ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి.
ఈ ఆపరేషన్‌లో భార్య ఆషి మిశ్రా, కానిస్టేబుల్ నితిన్ రాణా, మయాంక్ వశిష్ఠ, శుభం శర్మ, శివం రాజ్‌పుత్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో నిందితుడు మనోజ్ రాజ్‌పుత్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply