అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ, భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ ప్రజలకు భారీ ఊరటనిస్తూ ఆ దేశ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 3 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, కొత్త ధరల తగ్గింపు నవంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్కడ పెట్రోల్ ధర వరుసగా 11వ సారి తగ్గింది. ప్రస్తుతం ఒక లీటర్ పెట్రోల్ 325 పాకిస్థాన్ రూపాయలకు విక్రయించబడుతోంది. అదే సమయంలో, హై-స్పీడ్ డీజిల్ ధరలో ఎలాంటి మార్పు చేయకుండా లీటరుకు 358 పాకిస్థాన్ రూపాయలుగానే కొనసాగిస్తున్నారు.
గతంలో అమెరికా – ఇరాన్ యుద్ధం తారాస్థాయిలో ఉన్నప్పుడు పాకిస్థాన్‌లో ఇంధన ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. ముఖ్యంగా, యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 28న రూ.281గా ఉన్న లీటర్ డీజిల్ ధర, ఏప్రిల్ 3 నాటికి రూ.520.35కి, రూ.260గా ఉన్న పెట్రోల్ ధర రూ.458.41కి ఎగబాకింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు నిల్వలు పెరిగి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 92 డాలర్లకు, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ఆయిల్ 83 డాలర్లకు పడిపోవడంతో ఈ ధరల తగ్గింపు సాధ్యమైంది.
అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికీ పెట్రోల్‌పై లీటరుకు రూ.114, డీజిల్‌పై లీటరుకు రూ.100 పన్నుగా వసూలు చేస్తోంది. అంతేకాకుండా, ప్రజలకు సహాయం చేసేందుకు గత సెప్టెంబర్ 17న మోటార్ సైకిళ్లు, రిక్షాలు మరియు 800cc లోపు వాహనాలకు ‘ప్రధానమంత్రి ఇంధన ఉపశమన పథకాన్ని’ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో పాటు, చమురు శుద్ధి కర్మాగారాల సహకారంతో ధరలను నియంత్రించే చర్యలను కూడా తీసుకుంటుండటం గమనార్హం.

Leave a Reply