మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజ్ షమానీ, నేడు ప్రపంచ స్థాయిలో ప్రముఖ యువ పారిశ్రామికవేత్తగా, పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా ఎదిగారు. 29 ఏళ్ల రాజ్, తన 16వ ఏట కేవలం రూ.10,000 అప్పు చేసి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలో, తండ్రి అనారోగ్య సమస్య కారణంగా కుటుంబ వ్యాపారంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు.
అప్పుగా తెచ్చిన రూ.10,000తో పాత్రలు తోమే లిక్విడ్‌ను తయారు చేసి, దానికి ‘జాదూగర్ డ్రాప్’ అని పేరు పెట్టారు. ప్రారంభంలో స్వయంగా ఆ ఉత్పత్తులను తయారు చేసి, ఇంటింటికీ, దుకాణాలకు తిరిగి విక్రయించారు. ఈ అనుభవం ఆయనకు సేల్స్, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణపై ప్రాథమిక అవగాహనను అందించింది. 2015లో తన వ్యాపారాన్ని తండ్రి కుటుంబ వ్యాపారంతో విలీనం చేసి ‘షమానీ ఇండస్ట్రీస్’ అనే సంస్థగా విస్తరించారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా, పాడ్‌కాస్ట్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. 2020లో ఇండోర్ నుంచి ముంబైకి వచ్చిన ఆయన, ‘వాయిసెస్ విత్ రాజ్’ పేరుతో తన తొలి పాడ్‌కాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట్లో చేసిన అనేక ప్రయత్నాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత 2021లో ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రారంభంలో ఒక చిన్న గదిలో, పరిమిత వనరులతో రికార్డ్ చేసిన ఈ కార్యక్రమం మొదటి 20 ఎపిసోడ్లకు పెద్దగా ఆదరణ లభించలేదు. అయినప్పటికీ ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు.
నిరంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి ముఖాముఖి నిర్వహించడంతో ఈ షో వీక్షకుల సంఖ్య వేగంగా పెరిగింది. బిల్ గేట్స్, మిస్టర్ బీస్ట్, విజయ్ మాల్యా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నవంబర్ 13న ఈ పాడ్‌కాస్ట్ యూట్యూబ్‌లో 2.2 కోట్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీని ద్వారా స్టీవెన్ బార్ట్‌లెట్‌కు చెందిన ‘ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ’, జో రోగన్ నిర్వహించే ‘ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్’ వంటి ప్రముఖ షోలను వెనక్కి నెట్టి, యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న పాడ్‌కాస్ట్‌గా రికార్డు సృష్టించింది.

Leave a Reply