మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో 35 ఏళ్ల విమానయాన సంస్థ మహిళా ఉద్యోగిని కిరాయి ముఠా చేతిలో దారుణంగా హత్యకు గురైన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళతో సంబంధం ఉన్న వ్యక్తి భార్యే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితురాలైన భార్యతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లా ధనోరి ప్రాంతానికి చెందిన వర్షా దుర్గర్ (35) ఒక విమానయాన సంస్థలో పనిచేస్తున్నారు. దీపావళి సెలవుల కోసం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. గత నవంబర్ 14న తన స్నేహితుడు నితీశ్ అగర్వాల్‌తో కలిసి కారులో మహారాష్ట్రలోని గోండియా జిల్లా తిరోడాకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో బొంద్రాని గ్రామ అటవీ ప్రాంతంలోని శివాలయం సమీపంలో కారును ఆపారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెంబడిస్తూ వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు, కేవలం వర్షాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కడుపు, వీపుపై కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. దీంతో వర్షా రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, ఘటనా స్థలానికి సమీపంలోని తిరోడా, బాలాఘాట్, గోండియా తదితర మార్గాల్లో అమర్చిన సుమారు 200 సీసీటీవీ కెమెరాల దృశ్యాలను 4 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో నితీశ్ అగర్వాల్ కారును ముగ్గురు యువకులు బైక్‌పై వెంబడించినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ప్రకారం, గోండియాకు చెందిన ఇమ్రాన్ కరీం షేక్ (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దారుణ హత్య వెనుక ఉన్న పూర్తి కుట్ర బయటపడింది.
తన భర్త నితీశ్ అగర్వాల్‌కు, వర్షా దుర్గర్కు మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఆగ్రహానికి గురైన నితీశ్ భార్య మోనా అగర్వాల్ (41), వర్షాను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన పొరుగింటి వ్యక్తి కునాల్ కుంభల్కర్ సహాయంతో షారుఖ్ ఖాన్ పఠాన్ అనే నేరస్థుడితో రూ.13 లక్షలకు సుపారీ కుదుర్చుకుంది. దీని ప్రకారం, ఇమ్రాన్ షేక్ (26), నలేన్ షేక్ (24), గిరీశ్ రావత్ (19) అనే ముగ్గురు కిరాయి హంతకులను రంగంలోకి దించారు.
నితీశ్ అగర్వాల్ ఉపయోగించిన కారు అతని భార్య మోనా పేరు మీద రిజిస్టర్ అయి ఉండటంతో పాటు, అందులో జీపీఎస్ (GPS) పరికరం కూడా అమర్చి ఉంది. దీని ద్వారా తన భర్త వర్షాను కలవడానికి వెళ్లిన విషయాన్ని కచ్చితంగా ట్రాక్ చేసిన మోనా, కిరాయి ముఠాకు సమాచారం అందించి అటవీ ప్రాంతంలో ఈ హత్యను చేయించింది. ప్రస్తుతం మోనా అగర్వాల్ సహా నలుగురిని అరెస్టు చేసి దావనీవాడా పోలీస్ స్టేషన్‌కు అప్పగించగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply