“మీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతా ఉందా?”.. వెంటనే ఇలా చేయండి.. 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు!

నేటి డిజిటల్ ప్రపంచంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో, ఇతరుల పేరు, ఫోటోలను ఉపయోగించి నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడే ఘటనలు కూడా అధికమవుతున్నాయి.

ముఖ్యంగా, ఒకరి ఫోటోను ఉపయోగించి వారి స్నేహితులు, బంధువుల నుంచి అత్యవసరంగా డబ్బులు అడగటం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, అసభ్యకర సందేశాలు పంపడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, మీ పేరుతో నకిలీ ఖాతా ఉన్నట్లు తెలిస్తే ముందుగా ఏం చేయాలి అనే ప్రశ్నకు చట్టం స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది.

మరొకరిలా నటిస్తూ ఇంటర్నెట్ ద్వారా మోసం చేయడం ‘వ్యక్తిగత మోసం’ (ఇంపర్సనేషన్) నేరం కిందకు వస్తుంది. సమాచార సాంకేతిక చట్టం (IT Act) 2000లోని సెక్షన్ 66D ప్రకారం, ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. అలాగే, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 319(1), 319(2) ప్రకారం కూడా వేరొకరి పేరుతో మోసం చేసే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే, కేవలం నకిలీ ఖాతా సృష్టించినంత మాత్రాన ఈ సెక్షన్లు దానంతట అవే వర్తించవు; మోసం చేయాలనే ఉద్దేశం, ఘటన తీవ్రతను బట్టే చట్టపరమైన చర్యలు ఉంటాయి. కాబట్టి, నకిలీ ఖాతాను గుర్తించిన వెంటనే దాని స్క్రీన్‌షాట్, లింక్, యూజర్ నేమ్, మెసేజ్‌లు, తేదీ, సమయం తదితర ఆధారాలను భద్రపరుచుకోవడం ఎంతో అవసరం.

అంతేకాకుండా, మీ అసలు సోషల్ మీడియా ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చి, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (రెండంచెల భద్రత) సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేస్తే, ఐటీ నిబంధనలు-2021 ప్రకారం నకిలీ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులపై 24 గంటల్లోగా ఆ కంటెంట్‌ను తొలగించడం లేదా ఖాతాను బ్లాక్ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా, సైబర్ నేరాలకు సంబంధించిన www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో గానీ, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఆర్థిక మోసం జరిగి ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించడంతో పాటు, 1930 అనే సైబర్ ఆర్థిక మోసాల హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. డబ్బు నష్టం జరగకపోయినా నకిలీ ఖాతాలతో మోసం చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి జరిగితే ఫిర్యాదు చేయవచ్చని మర్చిపోకండి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *