“నాకే ఇచ్చి పెళ్లి చేయాలి!” ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై యువకుడి వన్ సైడ్ లవ్… పెళ్లి ఆపేందుకు ఢిల్లీ వెళ్లిన అతడికి ఎదురైన ఘోరం!

ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేహా బిష్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆమెకు నిశ్చితార్థం జరగగా, తన పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిరంతరం పోస్ట్ చేస్తూ వచ్చింది. వీటిని చూస్తూ వచ్చిన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన అభినవ్ (28) అనే యువకుడు నేహాపై ఏకపక్ష ప్రేమ (వన్ సైడ్ లవ్) పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇతడు చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలో నేహాకు పెళ్లి జరగబోతోందని తెలుసుకున్న అభినవ్, గత నవంబర్ 7న చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ నేహా ఇంట్లోకి ప్రవేశించిన అతడు, ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలంటూ గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన నేహా కుటుంబ సభ్యులు, అక్కడున్న వారు అభినవ్‌పై తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన అతడిని రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అభినవ్ నవంబర్ 14న మృతి చెందినట్లు సమాచారం.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. యువకుడి మృతి కేసులో నేహా తండ్రి వీరేందర్ బిష్ట్‌తో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఈ దాడి ఘటనలో యువతి సోదరుడితో పాటు స్థానికంగా ఉన్న మరికొందరికి కూడా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో మొదలైన ఏకపక్ష ప్రేమ, చివరకు ఓ ప్రాణం పోవడానికి, అరెస్టులకు దారితీయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *