2026లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు, తనకు మొదటి ఉద్యోగం ఇప్పించిన వారికి తన తొలి రెండు నెలల జీతాన్ని కృతజ్ఞతగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్’ (Reddit)లో పోస్ట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ వేటలో ఉన్న సవాళ్లను ప్రతిబింబించేలా ఉన్న ఇతడి పోస్ట్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
జావా డెవలపర్ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ యువకుడు, తనకు Java, Spring Boot, Spring Security, MySQL వంటి టెక్నాలజీలలో మంచి నైపుణ్యం ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా, తన ప్రతిభను నిరూపించుకునేలా మూడు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను కూడా రూపొందించినట్లు తెలిపాడు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో లేదా ఇంటి నుంచే పనిచేసే (రిమోట్) విధానంలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నానని అతడు చెప్పాడు. తనకు ఉద్యోగానికి ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదని, కేవలం ఇంటర్వ్యూలో పాల్గొని తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తే చాలని భావోద్వేగంగా రాసుకొచ్చాడు.
నైపుణ్యం ఉన్నప్పటికీ సరైన ఇంటర్వ్యూ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న పట్టభద్రుల పరిస్థితిని ఇతడి పోస్ట్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తన మొదటి రెండు నెలల జీతాన్నే ఇస్తానని ప్రకటించడం, ఉద్యోగంపై అతడికి ఉన్న తీవ్రమైన ఆసక్తిని, అవసరాన్ని తెలియజేస్తోంది.
ఈ యువకుడి భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చాలామంది అతడికి ధైర్యం చెబుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా, అతడికి ఉద్యోగం దొరికేలా సహాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు.

Leave a Reply