కర్ణాటకలోని మాండ్యా నగరంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రభుత్వ బస్సును అడ్డుకుని, ఓ యువకుడు మతపరమైన నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
మాండ్యా నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ మధ్య కర్ణాటక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వాహనాన్ని బస్సుకు అడ్డంగా నిలిపి, దాని ప్రయాణాన్ని అడ్డుకున్నాడు. అనంతరం “అల్లాహు అక్బర్” అంటూ గట్టిగా నినాదాలు చేశాడు.
ఆ వ్యక్తి ఊహించని చర్యతో బస్సులో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై వెళ్తున్న ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.
ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తూ, ప్రజల్లో భయాన్ని సృష్టించిన ఆ వ్యక్తిని పోలీసులు వెంటనే గుర్తించి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
పట్టపగలు, బహిరంగ ప్రదేశంలో ప్రభుత్వ బస్సును అడ్డుకుని ఇలా ప్రవర్తించే స్థాయికి చట్టంపై భయం తగ్గిపోయిందా? అంటూ ఎక్స్ వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, గత నవంబర్ 9న శివమొగ్గకు వెళ్తున్న కర్ణాటక ప్రభుత్వ బస్సులో పొరపాటున ఎక్కిన ఇద్దరు ప్రయాణికులతో ఓ కండక్టర్ మతపరమైన వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా వివాదానికి దారితీసింది.
ఆ ఘటనలో సంబంధిత కండక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు మాండ్యాలో మరోసారి ప్రభుత్వ బస్సుకు సంబంధించిన వివాదాస్పద ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply