ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటులో గత నవంబర్ 19న జరిగిన సమావేశం, సాధారణ రాజకీయ చర్చలకు భిన్నంగా ఎంతో భావోద్వేగ, ఆనందభరితమైన ఘట్టంగా మారింది.
రైడ్ (Ryde) నియోజకవర్గానికి చెందిన లిబరల్ పార్టీ ఎంపీ జోర్డాన్ లేన్, తన వీడ్కోలు ప్రసంగం చేస్తూ.. సందర్శకుల గ్యాలరీలో కూర్చున్న తన చిరకాల ప్రేయసి నటాలీకి ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
2027 మార్చిలో జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించిన ఆయన, తన చివరి ప్రసంగం మధ్యలో స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైడ్ నియోజకవర్గ సభ్యుడిగా తన చివరి ప్రశ్నను నటాలీని అడుగుతున్నానని చెప్పి, ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు.
ప్రసంగం మధ్యలోనే చిరునవ్వుతో జేబులోంచి నిశ్చితార్థపు ఉంగరాన్ని తీసిన జోర్డాన్ లేన్, కాస్త వణుకుతున్న చేతులతో నటాలీ వద్దకు వెళ్లి ఉంగరం తొడిగారు. నటాలీ కూడా ఆనందంగా అంగీకరించడంతో ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
ఈ దృశ్యాన్ని చూసిన సభలోని సభ్యులంతా లేచి నిలబడి ఉత్సాహంగా చప్పట్లు కొట్టగా, కొందరు సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయ పదవి నుంచి తప్పుకోవడం అనేది ముగింపు కాదని, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దిశగా వేస్తున్న గొప్ప అడుగు అని పేర్కొన్న జోర్డాన్ లేన్.. నటాలీ ‘అవును’ అని చెప్పిన విషయాన్ని పార్లమెంటు అధికారిక రికార్డుల్లో నమోదు చేయాలని సరదాగా కోరారు.
ఈ ఘటన అనంతరం మాట్లాడిన న్యూ సౌత్ వేల్స్ అసెంబ్లీ స్పీకర్ గ్రెగ్ పైపర్, 58వ పార్లమెంటును ‘ప్రేమ పార్లమెంటు’గా గుర్తుంచుకుంటారని చమత్కరించారు. పదేళ్లకు పైగా కలిసి ప్రయాణిస్తున్న జోర్డాన్, నటాలీల ఈ మధుర క్షణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వాడీవేడి చర్చలు జరిగే పార్లమెంటు సభలో ఇలాంటి మధురమైన సంఘటన చోటుచేసుకోవడం నెటిజన్ల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలను అందుకుంటోంది.

Leave a Reply