గత మే 2025లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే పాకిస్థాన్‌కు రహస్య సైనిక సహాయం అందించిందని ‘అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్షా కమిషన్’ తన వార్షిక నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.
భారత్ ఎదుగుదలను అడ్డుకునే భారీ ప్రణాళికలో భాగంగా, చైనా తయారీ J-10CE యుద్ధ విమానాలకు సాంకేతిక సహకారం అందించడంతో పాటు, భారత బలగాల కదలికలకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారాన్ని చైనా పాకిస్థాన్‌కు చేరవేసిందని ఆ నివేదిక పేర్కొంది.
పాకిస్థాన్‌తో చైనా పెంచుకుంటున్న ఈ సైనిక కూటమి భారత్‌కు ‘ద్విముఖ యుద్ధం’ ముప్పును సృష్టించింది. తూర్పు లడఖ్‌లో 2024 ఒప్పందంతో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని తెలిపింది.
అంతేకాకుండా, సరిహద్దులో వైమానిక స్థావరాలు, రైల్వే లైన్లను విస్తరిస్తూనే, హిందూ మహాసముద్రంలోనూ తన నౌకాదళ, నిఘా కార్యకలాపాలను చైనా ముమ్మరం చేసింది.
కేవలం సైనిక ఒత్తిడి మాత్రమే కాకుండా, భారత తయారీ రంగాన్ని దెబ్బతీసేందుకు చైనా ఆర్థిక ఆంక్షలను కూడా ఆయుధంగా వాడుకుంది. కీలకమైన పారిశ్రామిక ముడిసరుకులు, పరికరాల ఎగుమతులను నిలిపివేయడం, తమ ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకోవడం వంటి చర్యలతో భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ మందగించింది.
దీనికి తోడు బ్యాటరీ టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షలు, ఔషధ ముడిసరుకుల ధరలను తగ్గించడం వంటి చర్యల ద్వారా కొత్తగా వస్తున్న భారత కంపెనీలను చైనా ఇబ్బందులకు గురిచేస్తోంది. భారత్ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదుగుతున్నప్పటికీ, అనేక భారత పరిశ్రమలు ఇప్పటికీ చైనా యంత్రాలు, విడిభాగాలపైనే ఆధారపడుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చైనా విసురుతున్న ఈ బహుముఖ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిఘా సమాచార మార్పిడి, రక్షణ సాంకేతికత, సముద్ర భద్రత, సరఫరా గొలుసు (సప్లై చైన్) వంటి రంగాల్లో భారత్‌తో అమెరికా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఆ కమిషన్ సూచించింది.
Leave a Reply