అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ ‘అమెరికన్ ఎయిర్‌లైన్స్’లో పనిచేస్తున్న ఓ పైలట్ జీతం వివరాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆ పైలట్ శాలరీ స్లిప్ ప్రకారం, ఆయన ఏడాది ఆదాయం సుమారు 4.58 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో దీని విలువ రూ.4 కోట్లకు పైనే. ఈ జీతం వివరాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మయామికి చెందిన ఆ పైలట్ బోయింగ్ 737 రకం విమానాన్ని నడిపే కెప్టెన్ అని తెలుస్తోంది. ఆయనకు ఒక గంట విమాన ప్రయాణానికి సుమారు 360 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.32 వేలు) వేతనంగా లభిస్తున్నట్లు శాలరీ స్లిప్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శాలరీ స్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
పైలట్లు ఏడాదికి ఎన్ని గంటలు విమానం నడుపుతారనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. సాధారణంగా పైలట్లకు ఏడాదికి గరిష్టంగా 900 గంటల వరకు విమానం నడిపేందుకు అనుమతి ఉంటుంది. దీని ప్రకారం నెలకు సగటున 75 గంటలు విమాన ప్రయాణ సమయంగా ఉంటుంది. అయితే, ఇదే వారి పూర్తి పని సమయం కాదు. విమాన ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు, భద్రతా తనిఖీలు, శిక్షణ మరియు ఇతర పనుల కోసం అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది.
బోయింగ్ 777, ఎయిర్‌బస్ ఏ350 వంటి భారీ విమానాలను నడిపే అనుభవజ్ఞులైన కెప్టెన్లకు గంటకు సుమారు 450 అమెరికన్ డాలర్ల వరకు వేతనం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. పైలట్ అనుభవం, విమానం రకం, పనిచేసే సంస్థ, ఒప్పంద నిబంధనలను బట్టి జీతం మారుతూ ఉంటుంది. ఈ శాలరీ స్లిప్ వైరల్ కావడంతో పైలట్ ఉద్యోగం, అందులో లభించే భారీ ఆదాయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Leave a Reply