చైనా పర్యటనకు వెళ్లిన ఓ భారత పర్యాటకుడు, అక్కడి ఓ ఆవు విగ్రహంపై రాసి ఉన్న వివరాలను చూసి తన మనసు ముక్కలైందంటూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఓ రెస్టారెంట్ వెలుపల ఏర్పాటు చేసిన ఎరుపు రంగు ఆవు విగ్రహం ముందు నిలబడి మాట్లాడిన ఆ యువకుడు.. ఆవు శరీరంలోని ఏ భాగంలో ఎలాంటి మాంసం లభిస్తుంది, అందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది వంటి వివరాలు దానిపై రాసి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురైనట్లు తెలిపాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో.. భారత్‌లో ఆవును దేవతగా, తల్లిగా పూజించే సంప్రదాయం ఉండగా, చైనాలో మాత్రం మాంసానికి మూలంగా, ప్రోటీన్ వివరాలతో విగ్రహంపై గుర్తులు పెట్టడం తనను ఎంతో బాధించిందని అతడు పేర్కొన్నాడు.
రెండు దేశాల్లో ఆవును ఏ కోణంలో చూస్తారో తన వీక్షకులకు తెలియజేసేందుకే ఈ వీడియో తీసినట్లు అతడు చెప్పాడు. చాంగ్‌కింగ్‌లోని యుజోంగ్ ప్రాంతంలో ఉన్న ఆ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు తమకు నచ్చిన మాంసం రకాలను ఎంచుకోవడానికి వీలుగా చైనీస్ భాషలో ఆ వివరాలు రాసి ఉన్నట్లు సమాచారం.
ఈ వీడియో ‘ఎక్స్’ (X) సహా పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సాంస్కృతిక భేదాలను అర్థం చేసుకోవాలని, వేరే దేశంలో మన నమ్మకాలను ఆశించకూడదని చాలామంది విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అదే సమయంలో, రెస్టారెంట్ అలంకరణ కోసం ఏర్పాటు చేసిన ఆ విగ్రహం పూర్తిగా వ్యాపార ఉద్దేశంతో పెట్టిందని, చైనాలో గోమాంసం తినడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటని కొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, భారత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో గోమాంసం వినియోగం ఉందన్న విషయాన్ని మరికొందరు గుర్తుచేస్తున్నారు.

Leave a Reply