ఏడాదికి రూ.25 లక్షలు సంపాదించే వరుడైనప్పటికీ, ఓ యువతి ఆ పెళ్లి సంబంధాన్ని తిరస్కరించింది. దీనికి గల కారణాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో, వివాహం మరియు కుటుంబ బాధ్యతలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
తల్లిదండ్రుల ద్వారా ఆ యువతికి వచ్చిన పెళ్లి సంబంధంలో వరుడు ఏడాదికి సుమారు రూ.25 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ జీతం తనకు పెద్ద విషయమేమీ కాదని, తాను కూడా అంతే మొత్తంలో సంపాదించగలనని ఆమె తెలిపింది. వరుడి ఆదాయం కంటే, పెళ్లి తర్వాత అతడు ఆశించిన జీవనశైలి తనకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొంది.
పెళ్లి తర్వాత రోజూ రెండు పూటలా వంట చేయాలని, తన తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని ఆ వరుడు ఆశించినట్లు యువతి తెలిపింది. అంతేకాకుండా, వరుడి ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు అని, రాబోయే కొన్నేళ్లలో అతడికి జుట్టు రాలిపోయే అవకాశం ఉందని తనకు అనిపించిందని చెప్పింది. అతడు తన తల్లితో చాలా సన్నిహితంగా ఉంటాడని, అందువల్ల తల్లి మాటే వింటూ నడుచుకునే వ్యక్తిగా భావించినట్లు పేర్కొంది.
ఈ పోస్ట్ నెట్టింట షేర్ అవ్వగానే చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఆ యువతి నిర్ణయానికి మద్దతు తెలుపగా, మరికొందరు ఆమె అంచనాలను ప్రశ్నించారు. వంట చేయడం అనేది కుటుంబ జీవితంలో ఒక భాగమేనని కొందరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, పెళ్లి తర్వాత బాధ్యతలు, తల్లిదండ్రులతో కలిసి ఉండటం వంటి విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోతే, పెళ్లికి ముందే తప్పుకోవడం సరైన నిర్ణయమేనని చాలామంది సమర్థిస్తున్నారు.

Leave a Reply