పెళ్లయి 8 ఏళ్లు గడిచిన తర్వాత భర్త నుంచి విడిపోవాలని ఓ మహిళ నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన బేబీ ఖాన్ హీనా, తన భర్త వసన్ ఖాన్‌తో ఉన్న వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మీడియాతో మాట్లాడిన ఆమె, ఇస్లాం మత సంప్రదాయంలో ఉన్న ‘ఖులా’ (Khula) పద్ధతిని ఉపయోగించి నిఖా బంధాన్ని ముగిస్తున్నట్లు తెలిపింది.
గత 2019 ఏప్రిల్ 7న వీరిద్దరికీ వివాహం జరిగింది. ఈ క్రమంలో గత నవంబర్ 20న భర్తకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ‘ఖులానామా’ లేఖను పంపినట్లు హీనా పేర్కొంది. భర్తతో రాజీ పడేందుకు జులై 4, ఆగస్టు 7 తేదీల్లో రెండుసార్లు నోటీసులు పంపినప్పటికీ, ఆయన చర్చలకు రాలేదని హీనా ఆరోపించింది.
ఇస్లాం సంప్రదాయం ప్రకారం, భార్య తన ఇష్టపూర్వకంగా వైవాహిక బంధాన్ని ముగించేందుకు ముందుకు రావడాన్ని ‘ఖులా’ అంటారు. భర్త విడాకులు ఇచ్చే పద్ధతి అయిన ‘తలాక్’ కంటే ఇది భిన్నమైనది. ఖులా పొందే సమయంలో భార్య కొన్ని హక్కులను వదులుకోవాల్సి రావచ్చు. అయితే, ఇందులో భర్త సమ్మతి తప్పనిసరా లేదా అనే అంశంపై ఇస్లామిక్ పండితుల మధ్య, కోర్టు తీర్పులలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో 1947లో సీతాపూర్‌లో జరిగిన ఓ కేసును హీనా తరఫు వారు ప్రస్తావించారు. అంతేకాకుండా, 2021లో కేరళ హైకోర్టు, 2025లో తెలంగాణ హైకోర్టు సైతం భర్త సమ్మతి లేకుండానే మహిళలు ఖులా పొందే హక్కుపై తీర్పులు వెలువరించాయని గుర్తుచేశారు. దీంతో లక్నో మహిళ తీసుకున్న ఈ ‘ఖులా’ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply