చైనాలోని షియాన్ (Xi’an) నగరంలో పీహెచ్‌డీ చేస్తున్న సయ్యద్ షాన్ ఆలం అనే భారత యువకుడు, భారత్ మరియు చైనా సాధారణ రైళ్ల మధ్య ఉన్న తేడాలను చూపుతూ 59 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
రెండు దేశాల్లోని సాధారణ రైళ్లలో ప్రయాణించిన తన అనుభవాన్ని అతడు ఈ వీడియోలో పోల్చి చూపించగా, అది నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియోలో అతడు పేర్కొన్న వివరాల ప్రకారం.. చైనా రైళ్లలో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత కూడా బోగీలు చాలా శుభ్రంగా కనిపిస్తాయని, వాష్‌రూమ్ ఖాళీగా ఉందా లేదా అనేది సీట్లో కూర్చునే లైట్ల ద్వారా తెలుసుకునే సదుపాయం ఉందని తెలిపాడు.
అంతేకాకుండా, చైనా రైళ్లలో కిటికీలు తెరవడం సాధ్యం కాదని, స్టేషన్లలో రైలు ఆగిన తర్వాత ప్రత్యేక సిబ్బందే తలుపులు తెరుస్తారని వివరించాడు. కానీ భారత రైళ్లలో ప్రయాణికులే కిటికీలు, తలుపులు తెరిచే పరిస్థితి ఉందని, భోజనం చేసిన తర్వాత చెత్తను అక్కడే వదిలేసే ధోరణి, టాయిలెట్లను శుభ్రంగా ఉంచని పరిస్థితి కనిపిస్తోందని అతడు ఎత్తిచూపాడు.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే బడ్జెట్, ఆర్థిక పరిమాణం విషయంలో చైనాతో భారత్‌ను పోల్చలేమని, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చే భారత రైల్వేకు సవాళ్లు ఎక్కువగా ఉంటాయని కొందరు అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, సదుపాయాల కంటే ముందు బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన, చెత్త వేయకూడదనే అలవాటు ప్రతి ప్రయాణికుడిలోనూ రావాలని, భారత రైళ్లలో పరిశుభ్రత, నిర్వహణ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply