కళ్లారా చూసి మురిసిపోవాల్సిన కన్నబిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఎదురైంది. ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం ఇప్పిస్తామని నమ్మించి, కేవలం వారం రోజుల వయసున్న ఆడ శిశువును అపహరించి విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
బిహార్‌కు చెందిన అమ్రేష్ కుమార్, సోనీ కుమారి దంపతులకు ఈ నెల 13న గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించింది. ఆసుపత్రి నుంచి బిడ్డతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఓ మహిళ వారి వద్దకు వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకం కింద ఆర్థిక సాయం ఇప్పిస్తానని నమ్మబలికింది.
ఆమె మాటలు నమ్మిన శిశువు తండ్రి, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావడానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ మహిళ పసికందును ఎత్తుకుని, బయట సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తి సహాయంతో అక్కడి నుంచి పరారైంది.
దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితులు ఉపయోగించిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోతుపల్లికి చెందిన హేమలత, ఆమె సహచరుడు రిజ్వాన్‌ను గుర్తించి పట్టుకున్నారు.
విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సంతానం లేని షమీనా బేగం, ఇమ్రాన్ దంపతులకు ఈ చిన్నారిని రూ.లక్షకు విక్రయించేందుకు హేమలత ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో నస్రీన్ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.50 వేల అడ్వాన్స్ కూడా అందినట్లు విచారణలో వెల్లడైంది. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ సాయం పేరుతో ఈ అపహరణకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న హేమలతతో పాటు రిజ్వాన్, నస్రీన్, మహమ్మద్ జానీ, షమీనా బేగం, ఇమ్రాన్‌లను కలిపి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అపహరణకు గురైన పసికందును సురక్షితంగా రక్షించి, ఎలాంటి గాయాలు లేకుండా తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నబిడ్డ క్షేమంగా తిరిగి చేరడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply