అల్లారుముద్దుగా పెంచుకున్న ఏకైక కుమారుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువకుడు అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి పడి మరణించిన ఘటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తొలుత ప్రమాదంగా భావించిన ఈ ఘటనపై యువకుడి తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌కు చెందిన కాగితాల వ్యాపారి విశాల్ ఖండేల్వాల్ కుమారుడు సంభవ్ ఖండేల్వాల్ (22) గత నవంబర్ 14న రుద్రాగ్రీన్ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు.
ఆ రోజు స్నేహితులను కలవడానికి వెళ్తున్నానని చెప్పి సంభవ్ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడిపోయాడనే సమాచారం తండ్రికి అందింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి యువకుడి ప్రియురాలి కుటుంబ సభ్యులు మరో వివరణ ఇచ్చారు. ఇంట్లో ఓ చిన్నారితో కలిసి సంభవ్ వాలీబాల్ ఆడుతుండగా బంతి బాల్కనీ వైపు వెళ్లిందని, అక్కడ దీపం నుంచి కారిన నూనెపై కాలు జారి కిందపడిపోయాడని వారు చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.
కానీ తన కుమారుడి మరణంపై తండ్రి విశాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. సంభవ్‌కు అతడి ప్రియురాలి మామ ప్రవీణ్ ఉడానితో గతంలో గొడవ జరిగిందని, ఆ సమయంలో తన కుమారుడిపై దాడి చేయడంతో పాటు మళ్లీ అపార్ట్‌మెంట్‌కు వస్తే చంపేస్తానని బెదిరించాడని తండ్రి ఆరోపించారు.
అంతేకాకుండా, ఘటనకు సంబంధించి ప్రియురాలి కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల్లో పొంతన లేదని, తన కుమారుడి మొబైల్ ఫోన్లోనూ మార్పులు చేసినట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు అంతస్తుల నుంచి పడిపోయినప్పటికీ చేతి గడియారం, కళ్లద్దాలు దెబ్బతినకుండా ఉండటం కూడా తనకు అనుమానంగా ఉందని తెలిపారు.
మరోవైపు, పోలీసులు తొలుత సీసీటీవీ ఫుటేజీ సహా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి ప్రమాద కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో సంభవ్ ప్రియురాలు సుహానా, ఆమె మామ ప్రవీణ్‌తో పాటు కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంభవ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Leave a Reply