తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించిన ఘటన మహారాష్ట్రలోని భివాండీలో కలకలం రేపింది. వరుసగా ఐదు రోజుల వ్యవధిలో రెండు అపార్ట్మెంట్లలో జరిగిన చోరీల్లో బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదుతో కలిపి మొత్తం రూ.18.25 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది. ఒక ఇంట్లో రాత్రి సమయంలో, మరో ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది.
మొదటి ఘటన నవంబర్ 12 సాయంత్రం నుంచి రాత్రి మధ్య టాండేల్ మొహల్లా ప్రాంతంలోని మామన్ అరబ్ అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. అక్కడి నాలుగో అంతస్తులో ఉన్న షారిక్ మజీద్ అరబ్ (44) అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదును దోచుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు మొత్తం విలువ రూ.11.10 లక్షలుగా అంచనా వేశారు. దీనిపై భోయివాడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
రెండో దొంగతనం నవంబర్ 18న పట్టపగలే వజా మొహల్లా ప్రాంతంలోని మరియం మంజిల్ అపార్ట్మెంట్లో జరిగింది. మూడో అంతస్తులోని ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన అగంతకుడు, ముక్కుపుడక, గొలుసులు, ఉంగరాలు, మంగళసూత్రం, నెక్లెస్ తదితర బంగారు ఆభరణాలతో పాటు వెండి పట్టీలు, చెవికమ్మలను దోచుకెళ్లాడు. వీటి విలువ రూ.1.90 లక్షలుగా పేర్కొన్నారు. అదనంగా రూ.5.25 లక్షల నగదును కూడా అపహరించడంతో, ఈ ఘటనలో మొత్తం నష్టం రూ.7.15 లక్షలకు చేరింది.
ఈ రెండో చోరీ ఘటన అపార్ట్మెంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో అనుమానాస్పద వ్యక్తి కదలికలు కనిపించడంతో, ఆ ఫుటేజీని పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు పోలీస్ స్టేషన్లకు చెందిన ప్రత్యేక బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా? లేక ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply