షాంఘై సహకార సంస్థ (SCO) తొలి ‘నాగరికతల సంవాద వేదిక’ (Civilization Dialogue Forum)లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్, సింధూ నదీ జలాల ఒప్పందంపై మాట్లాడారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. భారత్ ఆహ్వానిస్తే తాము ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. అంతేకాకుండా, తక్కువ సంక్లిష్టత ఉన్న అంశాలపై ముందుగా చర్చించి, ఆ తర్వాత అత్యంత క్లిష్టమైన వివాదాలపై మాట్లాడాలని ఆయన సూచించారు.
మరోవైపు, సింధూ నదీ జలాల ఒప్పందంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై మాట్లాడిన ముసాదిక్ మసూద్ మాలిక్, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి బదులుగా ఆధారాలు, పారదర్శకతతో చర్చలు జరపాలని కోరారు.
గత 18 నుంచి 24 నెలల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పాకిస్థాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, కాబట్టి ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పాకిస్థాన్ ప్రయోజనాలకు కూడా ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు తమ వద్ద ఉన్న ఆధారాలను ముందుంచి చర్చించుకోవాలని, శాశ్వత పరిష్కారానికి ఇదే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో సాంస్కృతిక మార్పిడి, చర్చల ద్వారా భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి సంభాషణ అత్యవసరమని అన్నారు.
విభిన్న నాగరికతల మధ్య ఘర్షణలను నివారించి, సంవాదం మరియు సామరస్యాన్ని పెంపొందించే ఈ ఆలోచనను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలా (పాత కోట)లో ఈ సదస్సు ప్రారంభోత్సవం జరిగింది.

Leave a Reply