చైనాలోని ఓ రద్దీ వీధిలో కత్తి పట్టుకుని ఓ మహిళ హల్‌చల్ చేయడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కత్తిని చూపిస్తూ బెదిరించడంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ పోలీసు అధికారి కేవలం ఐదు సెకన్లలో ఆమెను అదుపులోకి తీసుకుని పెను ప్రమాదాన్ని నివారించారు.
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో నానింగ్ నగరంలోని రద్దీ వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ చేతిలో కత్తి పట్టుకుని గట్టిగా అరుస్తూ ప్రజలను బెదిరించింది. దీంతో అక్కడున్నవారు భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు.
అదే సమయంలో తన వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి వెళ్తున్న వాంగ్ మెంగ్ అనే సాయుధ పోలీసు అధికారి ఈ అరుపులు విన్నారు. వెంటనే అక్కడి పరిస్థితిని గమనించి, సెలవులో ఉన్నప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు.
చాకచక్యంగా వ్యవహరించిన ఆయన కేవలం ఐదు సెకన్లలోనే మహిళ చేతిలోని కత్తిని లాక్కొని ఆమెను తన ఆధీనంలోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ కోసం తీసుకెళ్లారు.
ఆమె కత్తితో ఎందుకు హల్‌చల్ చేసిందనే విషయంపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఘటనకు ముందు ఓ దుకాణ యజమానితో ఆమె వాగ్వాదానికి దిగినట్లు కొన్ని కథనాలు వచ్చినప్పటికీ, పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు.
ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన వాంగ్ మెంగ్ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply