నూడుల్స్ తిన్న 118 మంది చిన్నారులకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక! 45 మందికి పైగా పిల్లలకు మెరుగైన చికిత్స

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో నిర్వహించిన జాతరలో నూడుల్స్ తిన్న చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో మొత్తం 118 మంది పిల్లలను ఆసుపత్రులకు తరలించారు. వీరితో పాటు అదే ఆహారం తిన్న 12 మంది పెద్దలు కూడా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా హిర్రీ గ్రామంలో నవంబర్ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ విక్రయించిన నూడుల్స్ తిన్న కొద్దిసేపటికే పలువురు చిన్నారులు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం ప్రారంభించారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత పిల్లలను వెంటనే కిర్నాపూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్న 45 మందికి పైగా చిన్నారులను మెరుగైన వైద్యం కోసం బాలాఘాట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ఆహారం తిన్న 12 మంది పెద్దలు కూడా ఆసుపత్రిలో చేరారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందిన మిగతా చిన్నారులు కోలుకోవడంతో వారిని ఇళ్లకు పంపించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలాఘాట్ జిల్లా కలెక్టర్ ఆదిత్య సింగ్ నవంబర్ 22 ఉదయం జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. పిల్లల వార్డుతో పాటు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 45 మంది చిన్నారులు, 12 మంది పెద్దల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ శత్రుఘన్ సింగ్ దాహియా వెల్లడించారు. బాధితులంతా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

అయితే, నూడుల్స్ తిన్న తర్వాతే ఈ ఘటన జరగడంతో ఆహారం కలుషితమైందా? లేక మరేదైనా కారణముందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *