ఢిల్లీలోని పాండవ్ నగర్ ప్రాంతంలో తల్లి వద్ద ఉన్న 8 నెలల మగబిడ్డ అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాలుడి తల్లి లక్ష్మి ఇ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె పనికి వెళ్లిన సమయంలో, బాబును చూసుకునే బాధ్యతను జ్యోతి అనే మహిళకు అప్పగించింది. ఈ క్రమంలో బాలుడు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణలో భాగంగా, బాబును చూసుకుంటున్న జ్యోతి ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో వస్తువులు కొనేందుకు బయటకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి బాలుడితో వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం సాంకేతిక ఆధారాలు, ఆటో డ్రైవర్ల విచారణ ద్వారా నిందితుడు వెళ్లిన మార్గం గురించి సమాచారం సేకరించారు.
ఈ సమాచారం ఆధారంగా, మధురకు చెందిన రిషిపాల్ (40) అనే సరుకు రవాణా వాహన డ్రైవర్ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లా వాజిద్పూర్ గ్రామంలో బాలుడు ఉన్నట్లు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, సత్రు (50), అతని భార్య కుస్మా (45)లను అరెస్టు చేసి బాలుడిని సురక్షితంగా రక్షించారు. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోనే బాలుడిని కాపాడారు.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న సత్రు – కుస్మా దంపతులు, వంశాన్ని నిలబెట్టడానికి, ఆస్తికి వారసుడిగా, వృద్ధాప్యంలో తమను చూసుకోవడానికి ఒక మగబిడ్డ కావాలని కోరుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం దాదాపు ఏడాది క్రితమే పథకం వేసి, రిషిపాల్ సహాయంతో 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర కోణాలపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply