సుమారు 100 నుంచి 150 ఏళ్ల నాటి తమ పూర్వీకుల ఇంట్లో ఉన్న బరువైన ఇనుప పెట్టెను కుటుంబ సభ్యులు తెరిచి చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చాలామంది పాత ఇళ్లను కూల్చి ఆధునిక భవనాలు నిర్మిస్తున్న ప్రస్తుత రోజుల్లో, పూర్వీకుల జ్ఞాపకాలను కాపాడుకుంటున్న ఈ కుటుంబం అనుభవం అందరినీ కదిలిస్తోంది.
తండ్రికి చెందిన పురాతన ఇంట్లో ఓ పాతకాలపు పెట్టె ఉందని సోదరులు చెప్పినప్పుడు నీలజ అనే నెటిజన్ మొదట దానిని తమాషాగా తీసుకున్నారు. అయితే, తల్లి కూడా ఆ విషయాన్ని ధృవీకరించడంతో, కుటుంబ సభ్యులతో కలిసి పూర్వీకుల ఊరికి వెళ్లి ఆ పెట్టెను చూశారు.
పాత కలప తలుపులు, మెట్లు, గోడలపై ఉన్న పాతకాలపు కరెంట్ స్విచ్‌లు ఆ ఇంటి సుదీర్ఘ చరిత్రకు అద్దం పడుతున్నాయి. ఆ ఇంట్లోని ఒక మూలలో దుమ్ము, తుప్పు పట్టి నీలం రంగులో ఉన్న బరువైన ఇనుప పెట్టెను తెరిచే ముందు కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు.
చేతులకు గ్లౌజులు ధరించి, సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులో సంక్లిష్టమైన తాళాన్ని సరైన తాళంచెవితో తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఏర్పడిన ఉత్కంఠ, ఆసక్తి చూసేవారిని కట్టిపడేశాయి. ఎంతో శ్రమించి ఆ తలుపు తెరవగా, లోపల ఉన్న చిన్న అరలు, రహస్య డ్రాయర్లలో బంగారం, వెండి నగలకు బదులుగా విలువైన పాత జ్ఞాపకాలు ఉన్నట్లు తెలిపారు.
అంతేకాకుండా, పెట్టె లోపలి తలుపు, గోడలపై దేవుళ్ల పాత చిత్రాలు అతికించి ఉండటం.. ఆ కాలంలో సంపదను, వ్యాపారాన్ని భక్తితో ముడిపెట్టి చూసే సంప్రదాయాన్ని గుర్తుచేస్తోంది. ఈ వీడియో లక్షలాది వ్యూస్ సాధించగా, దీనిని ‘నిజమైన వారసత్వ సంపద’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply