అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వాషింగ్టన్ స్క్వేర్ పార్క్‌లో నవంబర్ 21న జరిగిన ఓ విచిత్రమైన పోటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఎన్విడియా (Nvidia) సంస్థ మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో, ‘చైనా గూఢచారి’ వేషధారణ పోటీ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, చాలామంది గూఢచారుల తరహా దుస్తులు, వేషధారణతో వచ్చి రహస్య పత్రాలను దొంగిలిస్తున్నట్లు, గూఢచారి స్టైల్లో పోజులిస్తూ నటించి చూపించారు. అందులో ఒకరు జెన్సన్ హువాంగ్ వేషంలో, సుమారు పది మంది మహిళలు ఆలిస్ హువాంగ్ వేషధారణలో పాల్గొన్నారు.
‘ఫ్యాక్ట్మెషిన్’, ‘ప్రెస్’ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెబుతున్న ఈ పోటీలో, గట్టిగా అరుస్తూ విజేతను ఎన్నుకోకుండా క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా ఓటింగ్ విధానాన్ని అనుసరించారు. విజేతకు 50 డాలర్లు (సుమారు రూ.4,600) నగదు బహుమతి ప్రకటించినట్లు తెలుస్తోంది.
సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థతో సంబంధం ఉన్న మహిళా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్, చైనా నిఘా సంస్థ కోసం సమాచారాన్ని సేకరించారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే, అమెరికా అధికారులు ఆమెను గూఢచారి అని ఇప్పటివరకు నిర్ధారించలేదని, ఈ ఆరోపణలను చైనా ఖండించిందని సమాచారం. ఈ క్రమంలోనే జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కూడా బయటపడటంతో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకుని క్షమాపణలు కోరినట్లు చెబుతున్నారు.
ఈ వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ తీవ్రమైన అంశాన్ని కూడా న్యూయార్క్‌లో హాస్యంగా మార్చేశారని ఒక వర్గం వారు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు, చాలామంది దీనిని జాత్యహంకార, సున్నితత్వం లేని చర్యగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆసియా మహిళలపై ఉన్న పాత తప్పుడు అభిప్రాయాలను ప్రోత్సహిస్తుందని, కార్యాలయాల్లో కూడా ఆసియా-అమెరికన్ మహిళలపై తప్పుడు దృక్పథం ఏర్పడటానికి కారణమవుతుందని ఆసియా-అమెరికన్ మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply