మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న తామ్హిణి ఘాట్ (కొండ) మార్గంలో 1,200 అడుగుల లోతైన లోయలో కారు బోల్తా పడిన ప్రమాదంలో వ్యాపారవేత్త శ్రీనివాస్ బెండ్కలే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఆయన అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ తామ్హిణి ఘాట్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. అప్పుడు సుమారు 1,200 అడుగుల లోతైన లోయలో ఆయన ఫార్చ్యూనర్ కారు ప్రమాదానికి గురై పడి ఉండటాన్ని కనుగొన్నారు. అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో కారు పడిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం పెద్ద సవాలుగా మారింది.
అనంతరం పౌడ్ పోలీస్ స్టేషన్ అధికారి మహేష్ పవార్ మార్గదర్శకత్వంలో, సహ్యాద్రి వన్యప్రాణి సంరక్షణ సంస్థ (SVRSS) సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆధునిక రెస్క్యూ పరికరాల సహాయంతో లోతైన లోయలోకి దిగిన బృంద సభ్యులు, సుదీర్ఘ శ్రమ తర్వాత కారును మరియు వ్యాపారవేత్త మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వ్యాపారవేత్త రెండు రోజులుగా కనిపించకుండా పోయిన నేపథ్యంలో, సెల్‌ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా జరిపిన గాలింపులో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. అయితే, కారు ఏ కారణంతో లోయలో పడిపోయిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృంద సభ్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Leave a Reply