దేవుడికి దండం పెట్టి మరీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగ! నెల రోజుల తర్వాత మళ్లీ అదే ఆలయానికి రాక.. ఈసారి పూజారికి అడ్డంగా దొరికిపోయాడు!

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో ఆలయంలోకి చొరబడి వింత రీతిలో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తి, నెల రోజుల తర్వాత మళ్లీ అదే ఆలయానికి వచ్చి పట్టుబడిన ఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది.

గర్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవతాల్ ప్రాంతంలో ఉన్న నరసింహ శివాలయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనం చేయడానికి ముందు దేవుడికి మొక్కి, ఆ తర్వాత విగ్రహం, నగదును ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆలయంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి ముందుగా అగరబత్తీలు వెలిగించి పూజ చేశాడు. అనంతరం వినాయకుడికి ఏడుసార్లు నమస్కరించి, శివయ్యకు కూడా మొక్కాడు. ఆ తర్వాత ఆలయంలో ఉన్న విగ్రహం, అలంకరణ వస్తువులు మరియు పూజా సామగ్రిని దొంగిలించినట్లు సమాచారం. అంతేకాకుండా, తనతో పాటు తెచ్చుకున్న పనిముట్లతో హుండీని పగులగొట్టి అందులోని నగదును కూడా అపహరించాడు. ఈ తతంగమంతా ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నమోదైంది.

ఈ క్రమంలో సుమారు నెల రోజుల తర్వాత అదే వ్యక్తి మళ్లీ ఆలయానికి వచ్చాడు. చేతిలో అగరబత్తీలతో వచ్చిన అతడు, అక్కడున్న పూజారిని అగ్గిపెట్టె అడిగాడు. ఆ సమయంలో అతని ముఖాన్ని చూసిన పూజారికి అనుమానం కలిగింది. అప్పటికే సీసీటీవీ దృశ్యాలను చూసి ఉండటంతో, వచ్చిన వ్యక్తి దొంగతనానికి పాల్పడిన నిందితుడేనని పూజారి గుర్తుపట్టాడు. వెంటనే స్థానికులకు విషయం చెప్పి, పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు గర్హా ప్రాంతానికి చెందిన కరణ్ చక్రవర్తి అని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆలయంలో గత కొన్ని నెలలుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ ముఠా ముందుగానే ఆలయంలో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతోందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో సీఎస్పీ ఆశిష్ జైన్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *