“వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?”.. వెంటనే దీన్ని తనిఖీ చేసుకోండి!.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కీలక హెచ్చరిక..!

బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లు లేదా ఇతరులు ఉపయోగించే ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), బ్రౌజింగ్ సెంటర్లు, హోటళ్లలోని బిజినెస్ సెంటర్లు, కార్యాలయాల్లో అందరూ పంచుకునే (షేర్డ్) కంప్యూటర్ల వంటి వాటిలో వాట్సాప్ వెబ్ ఉపయోగించడం మానుకోవాలని సూచించింది. ముఖ్యంగా, వాట్సాప్ వాడిన తర్వాత బ్రౌజర్ విండోను మాత్రమే మూసేస్తే అకౌంట్ దానంతట అదే లాగ్-అవుట్ కాదు కాబట్టి, ఇతరులు మీ ఖాతాను నిరంతరం యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇలాంటి భద్రతా లోపాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత చాట్‌లు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు వంటి సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ వాట్సాప్ ఖాతా నుంచే స్నేహితులు, బంధువులకు మెసేజ్‌లు పంపి డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడవచ్చు. కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ వాడాల్సి వస్తే, ‘ఇన్‌కాగ్నిటో’ లేదా ‘ప్రైవేట్ బ్రౌజింగ్’ మోడ్‌ను ఎంచుకోవాలి. వినియోగం పూర్తయ్యాక బ్రౌజర్‌ను మూసేయడంతోనే సరిపెట్టకుండా, తప్పనిసరిగా అకౌంట్ నుంచి లాగ్-అవుట్ కావాలని కూడా సూచించింది.

అంతేకాదు, పబ్లిక్ కంప్యూటర్ల ద్వారా ప్రభుత్వ పత్రాలు, కార్యాలయ రహస్యాలు, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంబంధిత కీలక సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించింది. మీ అనుమతి లేకుండా ఏవైనా మెసేజ్‌లు వెళ్లినట్లు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినట్లు గుర్తిస్తే, వెంటనే మొబైల్‌లోని ‘లింక్డ్ డివైసెస్’ (Linked Devices) విభాగానికి వెళ్లి అనుసంధానమైన కంప్యూటర్ల నుంచి లాగ్-అవుట్ చేయాలి. దాంతో పాటు, మొబైల్ మరియు కంప్యూటర్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్ సహా ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలని సైబర్ భద్రతా విభాగం సూచించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *