ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ ప్రాంతంలో, వివాహానికి కొద్దిసేపటి ముందు పెళ్లి కొడుకు మరో యువతితో కలిసి ఓ గదిలో ఉన్న విషయం తెలిసి షాక్ అయిన వధువు, పెళ్లిని సంచలనంగా రద్దు చేసుకున్నారు.
ఆ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల కాజల్‌కు, 26 ఏళ్ల ఆకాశ్‌కు పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. నవంబర్ 20న స్థానిక కల్యాణ మండపంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ దండలు మార్చుకున్న తర్వాత, తాళి కట్టడానికి అరగంట ముందు వరుడు ఆకాశ్ మండపంలోని ఓ గదిలోకి వెళ్లి చాలాసేపటి వరకు బయటకు రాలేదు.
కొద్దిసేపటికే మరో యువతి కూడా అదే గదిలోకి వెళ్లి లోపలి నుంచి తలుపుకు గడియ వేసుకోవడాన్ని గమనించిన వధువు తరఫు వారికి అనుమానం కలిగింది. చాలాసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆకాశ్‌ను బంధువులు ప్రశ్నించగా, అతను పొంతనలేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం వధువు కాజల్‌కు తెలియడంతో, ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని మండపమే రణరంగంగా మారింది.
తనను ఆకాశ్ మోసం చేశాడంటూ కాజల్ ఆరోపించారు. తనకు ఈ పెళ్లి వద్దని స్పష్టం చేస్తూ వెంటనే వివాహాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత పెళ్లికూతురు వేషధారణలోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె, ఆకాశ్‌పై ఫిర్యాదు చేయడంతో పాటు పెళ్లి కోసం తమ కుటుంబం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తన స్నేహితుడి చెల్లెలు తనను కలిసేందుకు వచ్చిందని ఆకాశ్ వివరణ ఇచ్చినప్పటికీ, లోపల గడియ వేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసిన వధువు కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply