యుద్ధం, దాడులు కొనసాగుతున్న హార్మూజ్ జలసంధి ప్రాంతంలో, బ్రిటన్కు చెందిన 56 ఏళ్ల ఈతగాడు లూయిస్ ప్యూ (Lewis Pugh) 15 కిలోమీటర్ల దూరం ఈత కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఒమన్ తీర ప్రాంతంలో మూడు రోజుల పాటు సాగిన ఈ ఈత ప్రయాణ ఉద్దేశం.. యుద్ధం వల్ల సముద్ర పర్యావరణానికి, సముద్ర జీవులకు వాటిల్లుతున్న నష్టాలపై ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడమే. ఆయన ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)తో అనుబంధం కలిగి ఉన్నారు.
ఈ ఈత ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా సాగింది. నీటిలోకి దిగిన సుమారు 30 నిమిషాల తర్వాత, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చమురు నౌకపై దాడి జరిగింది. బాంబు పేలుడు ప్రకంపనలతో సముద్ర జలాలే కంపించాయని లూయిస్ ప్యూ తెలిపారు. ఆకాశంలో యుద్ధ విమానాలను కూడా ఆయన చూశారు. దీంతో వెంటనే సముద్రం నుంచి బయటకు వెళ్లిపోవాలని అనిపించినప్పటికీ, తన ప్రయాణాన్ని కొనసాగించారు.
తర్వాతి రోజుల్లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను కూడా ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఒక గ్యాస్ నౌకపై దాడి జరగడంతో మంటలు చెలరేగడం, దాని చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతానికి మంటలు వ్యాపించడాన్ని తాను గమనించానని చెప్పారు. ఈ దాడుల వల్ల సముద్రంలో చమురు, రసాయన వ్యర్థాలు కలిసిపోయే ప్రమాదం ఉందని, అది సముద్ర జీవులకు తీవ్ర హాని కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హార్మూజ్ జలసంధి అనేది చమురు, గ్యాస్ రవాణా చేసే సముద్ర మార్గం మాత్రమే కాదు; డాల్ఫిన్లు, సముద్ర తాబేళ్లు, డుగాంగ్ (సముద్ర ఆవు) వంటి అరుదైన జీవులు నివసించే కీలక సముద్ర ప్రాంతం. ఇక్కడ పగడపు దిబ్బలు, మడ అడవులు కూడా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఈ పర్యావరణం దెబ్బతింటే, దాని ప్రభావాలు దశాబ్దాల పాటు కొనసాగే అవకాశం ఉందని లూయిస్ ప్యూ హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపాలని, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని, సముద్రంలో ఏర్పడిన కాలుష్యాన్ని శుభ్రం చేయాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply