కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో, అవివాహిత యువతి ఒకరు తాను ప్రసవించిన నవజాత ఆడ శిశువును పుట్టిన కొన్ని గంటల్లోనే గోడకేసి కొట్టి హత్య చేసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అడిమాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీవ్ర రక్తస్రావంతో చికిత్స కోసం వచ్చిన ఆ యువతిని వైద్యులు పరీక్షించగా, ఆమెకు కొన్ని గంటల క్రితమే ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం ఆమెను వెంటనే కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, అడిమాలి సమీపంలోని తోక్కుపార శంకుపడి ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద, పుట్టి కొన్ని గంటలే అయిన ఆడ శిశువు మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అడిమాలి పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రిలో రక్తస్రావంతో చేరిన ఆ అవివాహిత యువతే, మృతి చెందిన ఆడ శిశువుకు తల్లి అని నిర్ధారణ అయింది. అంతేకాకుండా, ప్రసవించిన కొన్ని గంటల్లోనే అంగన్వాడీ కేంద్రం గోడకు ఆ పసికందును కొట్టి ఆమె దారుణంగా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది.
వివాహానికి ముందే కలిగిన గర్భంతో శిశువు జన్మించడంతో, అవమానానికి భయపడి ఆ యువతి ఈ దారుణానికి పాల్పడిందా లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లే తన నవజాత శిశువును హత్య చేసిన ఈ విషాద ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply