ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా ప్రాంతంలో అడవి ఏనుగులను తరిమికొట్టడానికి ప్రయత్నించిన గ్రామస్తులకు గట్టి షాక్ తగిలింది.
ట్రాక్టర్లో అడవిలోకి వెళ్లిన గ్రామస్తులు, ఏనుగుల సమీపానికి వెళ్లి పెద్దగా కేకలు వేయడంతో ఆగ్రహానికి గురైన ఓ ఏనుగు ఒక్కసారిగా దాడికి దిగింది.
ఈ దాడిలో ఆ ఏనుగు తన తొండంతో ట్రాక్టర్ ఇంజిన్ను గట్టిగా పట్టుకుని తీవ్రంగా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చి కలకలం రేపుతున్నాయి.
అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, కోర్బా జిల్లాలో సుమారు 18 ఏనుగులు వేర్వేరు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన అటవీ ప్రాంతంలోనే ఒక గున్న ఏనుగుతో కలిపి మొత్తం 11 ఏనుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామస్తులు ఏనుగులను తరిమికొట్టడానికి వెళ్తున్న విషయాన్ని ముందుగా అటవీ శాఖకు తెలియజేయలేదని సమాచారం.
ఇకపై గ్రామస్తులు ఏనుగుల దగ్గరికి వెళ్లవద్దని, సొంతంగా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా దూరంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది.

Leave a Reply