ఆసియా దేశాల ఆర్థిక, సైనిక మరియు రాజకీయ ప్రభావాన్ని అంచనా వేసి విడుదల చేసే 2026వ సంవత్సరానికి గాను ‘ఆసియా పవర్ ఇండెక్స్’ (Asia Power Index) జాబితాలో భారత్ 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ (Lowy Institute) విడుదల చేసిన ఈ జాబితాలో, భారత్ 100కు గాను 40.5 పాయింట్లు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ స్కోరు 0.5 పాయింట్లు పెరిగింది.
ఈ జాబితాలో అమెరికా 78.9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, చైనా 73.6 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. భారత్ తర్వాత జపాన్ 38.6 పాయింట్లతో 4వ స్థానంలో, రష్యా 32.2 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
2018 నుండి విడుదల చేస్తున్న ఈ సూచీలో భారత్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. సైనిక బలం, ఆర్థిక సామర్థ్యం, దౌత్య సంబంధాలు, రక్షణ సహకారం, సాంస్కృతిక ప్రభావం సహా 8 ప్రధాన అంశాల ఆధారంగా 27 దేశాలు మరియు భూభాగాలను ఇందులో అంచనా వేశారు. భారత్ యొక్క రక్షణ సహకారం, సాంస్కృతిక ప్రభావం మరియు భవిష్యత్ వనరులలో గణనీయమైన పురోగతి కనిపించిందని నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఆసియా ప్రాంతీయ నాయకుల పనితీరు జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ స్థానంలో నిలిచారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. భారత్, చైనా మధ్య ఉన్న మొత్తం శక్తి వ్యత్యాసం 2018 తర్వాత అత్యల్ప స్థాయికి చేరుకుందని కూడా నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ, ఓవరాల్ రేటింగ్‌లో చైనా భారత్ కంటే గణనీయమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.

Leave a Reply