ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ పత్రాలు మరియు వైద్య రికార్డులలో మహిళల అసలు పేర్లకు బదులుగా ‘బీబీ’ (Bibi) అనే సాధారణ పదాన్ని ఉపయోగించాలని తాలిబన్లు ఆదేశించారు. అంతేకాకుండా, కొన్ని చోట్ల మహిళలను సూచించడానికి ‘మేక’, ‘ఆవు’ వంటి పదాలను కూడా ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
చాలామంది రోగుల రికార్డులు, మందుల చీటీలలో ఒకే రకమైన పదాన్ని ఉపయోగించడం వల్ల, రోగులను ఖచ్చితంగా గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తి వైద్యపరమైన పొరపాట్లు జరిగే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళల స్వీయ గుర్తింపును చెరిపివేసే చర్య అని వారు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, పలు ప్రావిన్సులలో పురుష వైద్యులు మరియు దంత వైద్యులు మహిళా రోగులకు చికిత్స అందించడంపై నిషేధం విధించారు. అత్యవసర పరిస్థితుల్లో సైతం పురుష సంరక్షకుడు లేదా మహిళా సిబ్బంది తోడు లేకుండా చికిత్స చేయకూడదని ఆదేశించడంతో, దంత వైద్యంతో సహా అనేక చికిత్సలు మధ్యలోనే నిలిచిపోయి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత 2024 డిసెంబర్ నుండి మహిళలు వైద్య విద్యను అభ్యసించడంపై నిషేధం కొనసాగుతుండగా, ఆసుపత్రులలో మహిళా సిబ్బందిని నియమించడంలోనూ కఠిన ఆంక్షలు ఉన్నాయి. దీనివల్ల వైద్య ఆరోగ్య రంగంలో పనిచేయడానికి మరియు చికిత్స పొందడానికి మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
పత్రాలలో మహిళల పేర్లను రాయకుండా ఉండే సంప్రదాయం అక్కడ దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన పోరాటాల ఫలితంగా అందులో కొంత మార్పు వచ్చింది. ప్రస్తుతం బాల్ఖ్ ప్రాంతంలో అమలు చేస్తున్న ఈ ఆంక్షలు దేశవ్యాప్తంగా విస్తరించవచ్చనే ఆందోళన మానవ హక్కుల కార్యకర్తలలో పెరుగుతోంది.

Leave a Reply