న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సలహాను గుడ్డిగా నమ్మి, సొంతంగా HIV నిరోధక మందులు వాడిన ఒక 45 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
అసలేం జరిగింది? వైద్యుని పర్యవేక్షణ లేకుండా సదరు వ్యక్తి ‘PrEP’ (Pre-Exposure Prophylaxis) అనే HIV నిరోధక మందును వాడారు. దీని దుష్ప్రభావం వల్ల అతనికి ‘స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్’ (Stevens-Johnson Syndrome) అనే అత్యంత ప్రమాదకరమైన చర్మ వ్యాధి సోకింది.
సాధారణంగా HIV సోకని వారు ముందస్తు జాగ్రత్తగా ఈ మందును వాడుతుంటారు. అయితే, ఈ వ్యక్తికి అప్పటికే HIV సోకి ఉండవచ్చు లేదా అతని శరీర తత్వానికి ఆ మందు పడకపోవచ్చు. ఎటువంటి క్లినికల్ పరీక్షలు చేయించుకోకుండా, కేవలం ఒక AI చాట్‌బాట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మందులు వాడటం అతని ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది.
వైద్యుల వివరణ: ప్రస్తుతం ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాధితుని అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. సరైన మోతాదులో, వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఈ మందులు 99 శాతం ఫలితాన్ని ఇస్తాయి. కానీ, రోగి యొక్క ఆరోగ్య చరిత్ర తెలియకుండా మందులు వాడటం ప్రాణాంతకమని ఈ ఘటన నిరూపిస్తోంది.
