బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) సాంకేతికత పెరిగిపోతుండటంతో తన ఉద్యోగం ఊడిపోయిందంటూ ఒక కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘రెడిట్’ (Reddit) లో పంచుకున్న ఆవేదన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
గత నాలుగేళ్లుగా సదరు కంపెనీలో ఎంతో నిబద్ధతతో, కష్టపడి పనిచేస్తున్నానని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. అయితే, కొంతకాలంగా సంస్థ తన రోజువారీ పనుల్లో అవసరం లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను జొప్పించడం ప్రారంభించినప్పుడే.. తన ఉద్యోగానికి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని గ్రహించినట్లు అతడు తెలిపాడు. తాము ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, కంపెనీలు కేవలం తమ లాభాలను పెంచుకునే ఏకైక ఉద్దేశంతో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు.
వందలాది దరఖాస్తులు.. శూన్య ఫలితం!
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం నరకప్రాయంగా మారిందని అతడు వాపోయాడు. ఇప్పటికే వందలాది కంపెనీలకు తన రెజ్యూమెను పంపినప్పటికీ.. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావడం లేదని తన నిరాశను పంచుకున్నాడు.
ఈ కార్పొరేట్ ఉద్యోగి పోస్టుకు నెటిజన్ల నుండి భారీగా మద్దతు లభిస్తోంది. తాము కూడా ప్రస్తుతం ఐటీ రంగంలో ఇటువంటి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నామని చాలా మంది కామెంట్ల రూపంలో తమ అనుభవాలను పంచుకున్నారు. కంపెనీలు దీనిని ‘ప్రొడక్టివిటీ’ (ఉత్పాదకత పెంపు) అని ముద్దుగా పిలుచుకుంటున్నప్పటికీ.. అంతిమంగా ఇది మానవ వనరుల ఉపాధిని దెబ్బతీయడమేనని పలువురు నెటిజన్లు వేలెత్తి చూపారు.
అయితే, అధైర్యపడకుండా ఉద్యోగ అన్వేషణను కొనసాగించాలని, కేవలం జాబ్ పోర్టల్స్ పైనే ఆధారపడకుండా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ (Up-skilling) ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని తోటి నెటిజన్లు అతనికి సలహా ఇచ్చారు. తాము కూడా నెలల తరబడి పోరాడి ఉద్యోగాలు సాధించామని చెప్తూ ఆ బాధిత ఉద్యోగిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపే ప్రయత్నం చేశారు.
