ఢిల్లీ: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా నుండి కేవలం రూ. 10 వేలు డ్రా చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఆయనకు రూ. 3 లక్షలు లభించినప్పటికీ, ఆయన మాత్రం సంతోషంగా లేరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మన దేశంలో బ్యాంకింగ్ సేవలు సులభంగానే ఉన్నప్పటికీ, కొన్నిసార్లు మనం ఊహించని చిక్కులు ఎదురవుతుంటాయి. సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 2017 ఫిబ్రవరి 18న సూరత్‌లోని ఉత్నా ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి, తన అవసరాల నిమిత్తం దగ్గరలోని ఎస్‌బీఐ (SBI) ఏటీఎంకు వెళ్లి రూ. 10,000 డ్రా చేయడానికి ప్రయత్నించారు.
మొదలైన ఇబ్బందులు
ఆయన తన డెబిట్ కార్డును ఉపయోగించి, పిన్ నంబర్ ఎంటర్ చేశారు. కానీ ఏటీఎం నుండి డబ్బు రాలేదు, రసీదు కూడా రాలేదు. అయితే, కొన్ని సెకన్లలోనే ఆయన మొబైల్‌కు రూ. 10,000 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఒక్క రూపాయి కూడా చేతికి రాకుండానే డబ్బులు కట్ అవ్వడంతో ఆయన షాక్‌కు గురయ్యారు.
సుదీర్ఘ పోరాటం
వెంటనే ఆయన ఫిబ్రవరి 21న తన ఖాతా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాతపూర్వక ఫిర్యాదు చేశారు. మార్చి నుండి మే వరకు ఎన్నో మెయిల్స్ పంపారు. రిజర్వ్ బ్యాంక్ (RBI) అధికారులకు కూడా విన్నవించారు. తన చేతికి డబ్బు రాలేదని నిరూపించడానికి సీసీటీవీ దృశ్యాలను ఆధారంగా చూపించారు. అటు ఎస్‌బీఐ ఏటీఎం కావడంతో అక్కడా ఆర్‌టీఐ (RTI) ద్వారా వివరాలు కోరారు.
అయినప్పటికీ ఏ బ్యాంక్ నుండి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆయన 2017 డిసెంబర్ 20న వినియోగదారుల కోర్టును (Consumer Court) ఆశ్రయించారు. గత 9 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగింది. విచారణలో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు మాట్లాడుతూ.. అది ఎస్‌బీఐ ఏటీఎం అని, తమ రికార్డుల ప్రకారం ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందని, కాబట్టి తమకు బాధ్యత లేదని వాదించారు.
కోర్టు కీలక తీర్పు
కానీ వినియోగదారుల కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు 5 రోజుల్లోపు డబ్బును తిరిగి ఖాతాలో వేయాలని, బ్యాంక్ ఆ పని చేయడంలో విఫలమైందని కోర్టు తప్పుపట్టింది.
కోర్టు తన తీర్పులో బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఈ క్రింది ఆదేశాలు జారీ చేసింది:
- అసలు మొత్తం రూ. 10,000ను ఏడాదికి 9% వడ్డీతో తిరిగి చెల్లించాలి.
- డబ్బు చెల్లించడంలో ఆలస్యమైన ప్రతి రోజుకు రూ. 100 చొప్పున పరిహారం ఇవ్వాలి.
- మొత్తం ఆలస్యమైన రోజులు 3,288 దాటడంతో, ఆ పరిహారం మొత్తం రూ. 3,28,800 అయ్యింది.
- దీనికి తోడు మానసిక వేదనకు రూ. 3,000, న్యాయపరమైన ఖర్చులకు రూ. 2,000 చెల్లించాలని ఆదేశించింది.
తీర్పు కస్టమర్‌కు అనుకూలంగానే వచ్చినప్పటికీ, కేవలం రూ. 10 వేల కోసం 9 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం, తన విలువైన సమయం వృథా అవ్వడంతో ఆ కస్టమర్ తీవ్ర విచారంలో మునిగిపోయారు.
