దోహా/రియాద్: మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం పరాకాష్టకు చేరుకుంది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ (LPG) ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకాయి.
గత ఫిబ్రవరి 28 నుండి అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం కొనసాగుతోంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో, నిన్న ఇరాన్‌లోని చమురు శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతికారంగా, ఈరోజు ఉదయం ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ ప్లాంట్‌పై ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించింది.
ఈ దాడి కారణంగా ప్లాంట్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఖతార్‌లోని ఇరాన్ దౌత్యవేత్తలను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.
సౌదీ యువరాజు హెచ్చరిక:
ఇరాన్ చర్యను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. సౌదీ విదేశాంగ మంత్రి/యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ మాట్లాడుతూ.. “మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇరాన్‌పై మాకు ఉన్న చివరి నమ్మకం కూడా ముక్కలైపోయింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి సౌదీ మరియు యూఏఈ పౌరులపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనికి సైనిక పరంగా తగిన సమాధానం ఇచ్చే హక్కు మాకు ఉంది,” అని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన ప్రకటనలో.. “ఇరాన్ యొక్క ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపం (Kharg Island) పై త్వరలో భారీ దాడి జరుగుతుంది. ఇరాన్‌లోని మిగిలిన లక్ష్యాలను అమెరికా సైన్యం త్వరలోనే ధ్వంసం చేస్తుంది,” అని పేర్కొన్నారు. అలాగే, హార్ముజ్ జలసంధిని రక్షించడానికి యుద్ధనౌకలను పంపని మిత్రదేశాలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక సంక్షోభం:
ఈ యుద్ధ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. తాజా సమాచారం ప్రకారం, ముడి చమురు ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరుకుంది.
“ఇరాన్ యొక్క 90 శాతం చమురు ఎగుమతులు జరిగే ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే, ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లను తాకవచ్చు” అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
