న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రస్తుతం E20 ఇంధనం వాడుకలో ఉంది. ఇందులో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటాయి. అయితే, ఈ కొత్త ఇంధనం మన వాహనాల ఇంజన్లకు సురక్షితమేనా? అనే సందేహాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు ఆటోమొబైల్ పరిశ్రమలోని దిగ్గజాలు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. EIL మాజీ సీఎండీ వర్తికా శుక్లా, టయోటాకు చెందిన విక్రమ్ గులాటీ, మారుతి సుజుకీకి చెందిన రాహుల్ భారతి, హీరో మోటోకార్ప్‌కు చెందిన అశుతోష్ వర్మ వంటి నిపుణులందరూ ఇథనాల్ బ్లెండింగ్ పూర్తిగా సురక్షితమని, శాస్త్రీయమని స్పష్టం చేశారు.
ఈ నిబంధన రాత్రికి రాత్రే వచ్చిందా? EIL మాజీ సీఎండీ వర్తికా శుక్లా మాట్లాడుతూ, ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదని చెప్పారు. 2014-15లో పెట్రోల్‌లో కేవలం 1.5 శాతం ఇథనాల్ మాత్రమే కలిపేవారు, ఇప్పుడు అది 20 శాతానికి పెరిగింది. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ముడి చమురు దిగుమతిపై భారత్ చేస్తున్న ఖర్చును భారీగా తగ్గిస్తుందని ఆమె పేర్కొన్నారు. కెనడా, అమెరికా మరియు బ్రెజిల్ వంటి దేశాల్లో దీనిని ఏళ్ల తరబడి వాడుతున్నారు.
ఫార్ములా వన్ కార్లలో కూడా వాడతారా? టయోటా కంట్రీ హెడ్ విక్రమ్ గులాటీ మాట్లాడుతూ, స్వతంత్ర టెస్టింగ్ ఏజెన్సీలు దీనిని ధృవీకరించాయని తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ప్రసిద్ధ ఫార్ములా వన్ రేసింగ్ కార్లలో కూడా దీనిని వాడుతున్నారు. ఇది పర్యావరణానికి మేలు చేసే అత్యుత్తమ ‘జీరో కార్బన్’ ఇంధనం అని ఆయన చెప్పారు.
మారుతి, హీరో వాహనాల పనితీరు ఎలా ఉంది? మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ, “2023 కంటే ముందే మేము E10 పెట్రోల్‌పై ఇంజన్లను పరీక్షించాము, ఎలాంటి సమస్యలు రాలేదు. ఆటోమొబైల్ రంగం సుదీర్ఘ పరీక్షల తర్వాతే దీనిని స్వీకరించింది” అని చెప్పారు. అలాగే, హీరో మోటోకార్ప్‌కు చెందిన అశుతోష్ వర్మ మాట్లాడుతూ, తాము కోట్ల సంఖ్యలో బైక్‌లకు సర్వీసింగ్ చేస్తామని, కానీ E20 ఇంధనం వల్ల ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

Leave a Reply