E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్: పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజిన్ దెబ్బతింటుందని లేదా మైలేజీ సగానికి పడిపోతుందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని చూసి మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ అపోహలన్నింటికీ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది. 10 ముఖ్యమైన అంశాలతో ఈ ప్రచారాలను ఖండించింది.
E20 పెట్రోల్ అంటే ఏమిటి? E20 పెట్రోల్ అంటే 20 శాతం ఇథనాల్ మరియు 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం. దీని ప్రధాన ఉద్దేశ్యం చమురు దిగుమతులను తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు కాలుష్యాన్ని తగ్గించడం. 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనుకున్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని భారత్ నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది.
ప్రభుత్వం వివరించిన 10 ముఖ్యమైన అంశాలు:
- ఇంజిన్ పాడవుతుందా?: ఏమాత్రం కాదు. ARAI మరియు IOC చేసిన శాస్త్రీయ పరీక్షల్లో E20 ఇంధనం వల్ల ఇంజిన్ భాగాలు లేదా మెటల్ భాగాలకు ఎటువంటి హాని కలగదని తేలింది. పాత వాహనాల్లోని రబ్బరు పైపులు మారాల్సి రావచ్చు, కానీ ఇంజిన్ పాడవుతుందనేది తప్పుడు ప్రచారం.
- వారంటీ/ఇన్సూరెన్స్ రద్దవుతుందా?: E20కి అనుగుణంగా తయారు చేసిన వాహనాలకు వారంటీ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎప్పటికీ రద్దు కావు.
- మైలేజీ తగ్గుతుందా?: ARAI చేసిన పరీక్షల్లో మైలేజీలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ ఉండదని, కొత్త వాహనాల పనితీరు మరింత మెరుగుపడుతుందని తేలింది.
- ఇంధన ట్యాంకులో చీమలు పడతాయా?: ఇది అత్యంత వింతైన అపోహ. ఇథనాల్ తయారీ ప్రక్రియలో మిగిలిన తీపిని పూర్తిగా తొలగిస్తారు. అలాగే, పెట్రోల్ వాసన వల్ల కీటకాలు దరిచేరవు.
- చెరకు రసం కలుపుతారా?: ఇది పూర్తిగా అబద్ధం. ఇథనాల్‌ను చాలా క్లిష్టమైన పారిశ్రామిక ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.
- నీరు వృథా అవుతుందా?: ఫ్యాక్టరీలు ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ (ZLD) సాంకేతికతను ఉపయోగిస్తాయి. 1 లీటర్ ఇథనాల్ కోసం కేవలం 3-5 లీటర్ల నీరు మాత్రమే వాడతారు.
- ఇదొక ప్రయోగమా?: కాదు. అమెరికా, బ్రెజిల్, కెనడా వంటి అనేక దేశాల్లో దశాబ్దాలుగా ఇథనాల్ పెట్రోల్ వాడుతున్నారు.
- ట్యాంకులో నీరు చేరుతుందా?: ఆధునిక వాహనాల ట్యాంకులను బయటి తేమ లోపలికి రాకుండా ప్రత్యేకంగా రూపొందిస్తారు.
- పర్యావరణానికి నష్టమా?: కాదు, ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి.
- దేశానికి లాభం ఏమిటి?: చమురు దిగుమతులు తగ్గడం వల్ల రూ. 1.9 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయ్యింది మరియు రైతులకు రూ. 1.6 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించింది.
