ఫుట్‌బాల్ ప్రపంచ రారాజు క్రిస్టియానో రొనాల్డో, తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌ను 2026 ఆగస్టు 11న అధికారికంగా వివాహం చేసుకున్నారు.
పోర్చుగల్‌లోని కాస్కాయిస్ నగరంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో వారి 5 మంది పిల్లలు మాత్రమే పాల్గొన్నారు. బయటి వ్యక్తులెవరూ లేకుండా అత్యంత సాదాసీదాగా, ప్రైవేట్ ఈవెంట్‌గా వీరి వివాహం ముగిసింది.
వీరి ప్రేమకథ మాడ్రిడ్ నగరంలోని ఒక ‘గుచ్చి’ (Gucci) స్టోర్‌లో మొదలైంది. అక్కడ సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జార్జినాను రొనాల్డో మొదటిసారి కలిశారు. నిజానికి ఆ రోజు జార్జినా డ్యూటీకి రావాల్సిన అవసరం లేనప్పటికీ, తన స్నేహితురాలి షిఫ్ట్ కోసం వచ్చిన సమయంలోనే వీరి అనుకోని పరిచయం ఏర్పడింది. 2016లో చిగురించిన వీరి ప్రేమ ప్రయాణం.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది.
ఎంతో కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. వీరికి నలుగురు పిల్లలు జన్మించగా, రొనాల్డోకు అప్పటికే ఒక పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. తమ కుటుంబ వేడుకలను, సంతోషకరమైన క్షణాలను వీరిద్దరూ తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకునేవారు.
గత 2025 ఆగస్టు 11న తమ నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు తీపి కబురు అందించారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి, తమ నిశ్చితార్థం జరిగిన రోజే ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
చిన్నతనంలో పెళ్లి గురించి ఎన్నో పెద్ద కలలు ఉండేవని, కానీ సెలబ్రిటీ అయ్యాక వ్యక్తిగత ప్రశాంత జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నానని జార్జినా గతంలో వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమ జంటగా కనిపించిన రొనాల్డో – జార్జినా ఇప్పుడు భార్యాభర్తలుగా మారడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తీవ్ర ఆనందోత్సాహాలను నింపింది.
