“H-4 వీసా ఉన్నవారికి భారీ షాక్..!” ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు మళ్లీ సరికొత్త సంక్షోభమా..???

అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసా కలిగిన భారతీయుల కుటుంబాలకు మరోసారి తీవ్ర సవాలు ఎదురుకానుంది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం, హెచ్-4 వీసాదారులకు కల్పిస్తున్న పని హక్కును (వర్క్ పర్మిట్) రద్దు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది.

హెచ్-1బీ వీసా ఉద్యోగుల జీవిత భాగస్వాములు (భర్త లేదా భార్య) మరియు పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్-4 వీసా. అమెరికా అంతర్గత భద్రతా విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదించిన నూతన నిబంధనలలో.. ఈ వీసా కేటగిరీలో ఉన్నవారి ఉద్యోగ అర్హతను రద్దు చేయాలని సిఫార్సు చేసింది.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 93 శాతం మంది భారతీయులే కావడంతో, ఈ నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. అందులోనూ ముఖ్యంగా, పని హక్కు పొందిన వారిలో 94 శాతం మంది మహిళలే కావడంతో వేలాది మంది భారతీయ మహిళల ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన ప్రశ్నార్థకంగా మారాయి.

అయితే, ఈ ప్రతిపాదన తక్షణమే అమల్లోకి వచ్చేయదు. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ముసాయిదా ప్రతిపాదన మాత్రమే. ఇది చట్టరూపం దాల్చడానికి ముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తారు; పలు దశల న్యాయ, అధికారిక ప్రక్రియల పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గతంలో 2017లోనూ ట్రంప్ యంత్రాంగం ఇలాంటి ప్రయత్నమే చేయగా, న్యాయ పోరాటాల అనంతరం 2021లో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే అస్త్రాన్ని ప్రయోగించడం అమెరికాలోని భారతీయ కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *