HIV పాజిటివ్ వ్యక్తి నెగటివ్ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా? నిపుణులు చెబుతున్న నిజాలివే!

ఒక వ్యక్తికి HIV సోకినప్పుడు అది పెద్ద ఆందోళన కలిగించే విషయమే. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ వైరస్ సోకితే, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా? తమ భాగస్వామికి కూడా ఈ వైరస్ సోకుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ అనుమానాలపై నిపుణుల విశ్లేషణ ఇదీ:

నిపుణుల అభిప్రాయం:

ఢిల్లీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ చంచల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారం HIV పాజిటివ్ వ్యక్తి, నెగటివ్ వ్యక్తిని వివాహం చేసుకోవడం సాధ్యమే. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి:

  • ART చికిత్స: HIV పాజిటివ్ ఉన్న వ్యక్తి తప్పనిసరిగా యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) వాడుతూ ఉండాలి.
  • వైరల్ లోడ్ (Viral Load): క్రమం తప్పకుండా మందులు వాడటం వల్ల రక్తంలో వైరస్ స్థాయి చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ వైరల్ లోడ్ ‘డిటెక్టబుల్’ (కనిపించని) స్థాయిలో ఉంటే, అప్పుడు ఒకరి నుండి మరొకరికి వైరస్ సోకే ప్రమాదం దాదాపు ఉండదు.
  • సురక్షిత సంబంధం: వైరల్ లోడ్ నియంత్రణలో ఉన్నప్పుడు, వైద్యుల సలహాతో సాధారణ దంపతుల్లాగే జీవితాన్ని గడపవచ్చు.
వివాహానికి ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
  1. నిజాయితీ: పెళ్లికి ముందే మీ HIV పరిస్థితి గురించి కాబోయే భాగస్వామికి నిజం చెప్పడం చాలా ముఖ్యం. నమ్మకం మీద ఆధారపడే బంధంలో దాపరికం ఉండకూడదు.
  2. కౌన్సెలింగ్: ఇద్దరూ కలిసి డాక్టరును సంప్రదించాలి. సురక్షితమైన శారీరక సంబంధం ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు వివరిస్తారు.
  3. రెగ్యులర్ చెకప్స్: పెళ్లి తర్వాత కూడా ప్రతి నెలా లేదా డాక్టర్ సూచించిన సమయానికి వైరల్ లోడ్ పరీక్షలు చేయించుకోవాలి.
పిల్లల విషయంలో ఆందోళన వద్దు:

చాలా మందికి HIV పాజిటివ్ తల్లిదండ్రులకు పుట్టే పిల్లలు కూడా పాజిటివ్‌గానే పుడతారని అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదు. సరైన వైద్య పర్యవేక్షణ, మందులు మరియు అవసరమైతే IVF వంటి పద్ధతుల ద్వారా ఆరోగ్యవంతుడైన (HIV నెగటివ్) బిడ్డను కనవచ్చు.


Posted

in

by

Tags: