Home Loan: 20 ఏళ్ల లోన్, 10 ఏళ్లలో తీర్చేయండి! లక్షల వడ్డీని ఆదా చేయడానికి ఈ ఒక్క పని చేస్తే చాలు!

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలని నిజం చేసుకోవడానికి మనం తీసుకునే గృహ రుణం మనల్ని దశాబ్దాల పాటు రుణగ్రస్తులుగా మార్చేస్తుంది. మనం బ్యాంకు నుండి తీసుకున్న అసలు మొత్తం కంటే వడ్డీ (Interest) రూపంలోనే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

సాధారణంగా 20 ఏళ్ల కాలపరిమితి గల రుణంలో మనం కట్టే ఈఎంఐ (EMI)లో సింహభాగం వడ్డీకే వెళ్తుంది. అయితే, ఒక స్మార్ట్ ప్లాన్ చేస్తే మీరు బ్యాంకుకు చెల్లించే లక్షలాది రూపాయలను మీ జేబులోనే మిగుల్చుకోవచ్చు. అదే ప్రతి ఏటా ఈఎంఐ మొత్తాన్ని కొంచెం పెంచడం.

బ్యాంకు వడ్డీ లెక్కల గుట్టు: లోన్ తీసుకున్న మొదటి కొన్ని సంవత్సరాల్లో మీరు కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది, అసలు (Principal) మొత్తం చాలా నెమ్మదిగా తగ్గుతుంది. దీనిని ఆర్థిక పరిభాషలో ‘ఫ్రంట్ లోడింగ్’ అంటారు. అంటే ప్రారంభంలోనే బ్యాంకు తన లాభాన్ని ముందుగా వసూలు చేసుకుంటుంది. మీరు లోన్ కాలపరిమితి అంతా ఒకే ఈఎంఐ కడుతూ పోతే బ్యాంకుకు భారీ లాభం, మీకు మాత్రం నష్టం!

ఈఎంఐ టాప్-అప్ అనే మ్యాజిక్: ఈఎంఐ టాప్-అప్ అంటే ప్రతి సంవత్సరం మీ జీతం పెరిగినట్లుగానే, మీ నెలవారీ కిస్తీని కేవలం 5% నుండి 10% వరకు పెంచడం. ఈ అదనపు డబ్బు నేరుగా మీ అసలు మొత్తాన్ని తగ్గిస్తుంది. అసలు మొత్తం ఎంత వేగంగా కరుగుతుందో, దానిపై పడే వడ్డీ భారం కూడా అంతే వేగంగా తగ్గుతుంది. రుణం తీర్చడానికి ఇది అత్యంత క్రమశిక్షణతో కూడిన మార్గం.

చిన్న మార్పు.. ఏకంగా రూ. 30 లక్షల లాభం! ఒక ఉదాహరణ చూడండి: మీరు 9% వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలపరిమితికి రూ. 50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. మీరు సాధారణంగా ఈఎంఐ కడుతూ పోతే కేవలం వడ్డీయే రూ. 58 లక్షలు అవుతుంది. అదే ప్రతి ఏటా మీ ఈఎంఐని కేవలం 10% పెంచితే, అదే రుణాన్ని కేవలం 10 ఏళ్లలోనే పూర్తి చేయవచ్చు! దీనివల్ల మీకు సుమారు రూ. 30 లక్షల వడ్డీ డబ్బు ఆదా అవుతుంది.

మొదటి 5 ఏళ్లు చాలా కీలకం: హోమ్ లోన్ తీసుకున్న మొదటి 5 నుండి 7 సంవత్సరాలు అత్యంత నిర్న్నాయకం (Critical). ఎందుకంటే ఈ దశలోనే వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొంచెం ఎక్కువ మొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించడం మొదలుపెడితే, దాని ప్రభావం మొత్తం లోన్ కాలపరిమితిపై పడుతుంది. మీరు ఎంత త్వరగా ఈ స్మార్ట్ మూవ్ చేస్తారో అంత ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు.

ఇది ఎవరికి బెస్ట్? ప్రతి ఏటా ఇంక్రిమెంట్ పొందే ఉద్యోగులకు, అదనపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇది చక్కని ప్లాన్. నెలవారీ బడ్జెట్ పై భారం పడకుండా కేవలం 5% పెంచినా చాలు, 20 ఏళ్ల రుణాన్ని 12-13 ఏళ్లలోనే ముగించవచ్చు. రుణ రహిత జీవితం గడపాలని అనుకునేవారికి దీనికంటే మంచి మార్గం మరొకటి లేదు.

పెట్టుబడి లాంటిదే ఈ చెల్లింపు: డబ్బును ఎక్కడో పెట్టుబడి పెట్టి లాభం చూడటం కంటే ముందు, అప్పుపై కట్టే వడ్డీని ఆదా చేయడం పెద్ద సంపాదనతో సమానం. మంచి ఆర్థిక క్రమశిక్షణ (Financial Discipline) మిమ్మల్ని అప్పుల ఊబి నుండి త్వరగా బయటపడేలా చేస్తుంది. బ్యాంకుకు లక్షల రూపాయలు వడ్డీగా కట్టే బదులు, అదే డబ్బును మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా రిటైర్మెంట్ జీవితం కోసం ఉపయోగించుకోవచ్చు.


Posted

in

by

Tags: