“నాన్న నన్ను హెచ్చరించారు- ‘అమ్మా, ఒకరోజు నువ్వు నడిరోడ్డున పడతావు’ అని.. ఈరోజు నేను నిజంగానే అక్కడే నిలబడ్డాను” అంటూ శిఖా సింగ్ బావురుమన్నారు. శిఖా సింగ్ సాధారణ మహిళ కాదు, ఆమె మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మహేంద్ర సింగ్ చౌహాన్ రెండో భార్య. తన భర్తపై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
IAS భర్తను వదిలేసి.. ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసిన 45 ఏళ్ల శిఖా సింగ్ కథ గుండెలను పిండేస్తుంది. 2007లో ఆమెకు ఒక ఐఏఎస్ (IAS) అధికారితో వివాహమైంది. అయితే, మహేంద్ర సింగ్ చౌహాన్ కుట్రలు పన్ని, తన ప్రభావంతో ఆమె మొదటి వివాహాన్ని పెటాకులు చేశాడని శిఖా ఆరోపించారు. తండ్రి మాట కాదని, తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన మహేంద్రను ఆమె వివాహం చేసుకున్నారు.
రూ. 2 కోట్లు మరియు కారు కోసం వేధింపులు: పెళ్లయిన కొద్దిరోజులకే మహేంద్ర అసలు స్వరూపం బయటపడిందని ఆమె వాపోయారు. తనను కొట్టడం, పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడని తెలిపారు. ఫిబ్రవరి 9న తనను దారుణంగా కొట్టి, రూ. 2 కోట్లు మరియు కారు తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తానని గెంటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విషం ఇచ్చి చంపే ప్రయత్నం: తన భర్త ఒకసారి జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చాడని, అది తాగిన తర్వాత స్పృహ తప్పి పడిపోయానని శిఖా వెల్లడించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాతే తనకు విషం ఇచ్చారని తెలిసిందని పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, భర్త వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయని ఆమె భయాందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీ, సీఎం మోహన్ యాదవ్‌లకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
మహేంద్ర సింగ్ వెర్షన్: అయితే, మహేంద్ర సింగ్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇదంతా ‘హనీట్రాప్’ అని, ఆమె గత 15 ఏళ్లుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను విడాకుల నోటీసు పంపినందుకే ఆమె ఈ కట్టుకథలు అల్లుతోందని ఆయన వాదించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
