కొలంబో: 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు అఖండ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమికి పాకిస్థాన్ జట్టు చేసిన తప్పుడు అంచనాలు, భారత్ పదునైన బౌలింగే ప్రధాన కారణాలుగా నిలిచాయి.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్‌ను కట్టడి చేసేందుకు పాక్ ఒక భారీ స్పిన్ వ్యూహాన్ని రచించింది. కానీ అదే వారికి శాపంగా మారింది.
పాకిస్థాన్ తప్పుడు అంచనా: కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన పాకిస్థాన్, భారత బ్యాటర్లను బోల్తా కొట్టించేందుకు ఏకంగా 6 గురు స్పిన్నర్లను బరిలోకి దింపింది. జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదీకి కేవలం 2 ఓవర్లు మాత్రమే ఇచ్చి, మిగిలిన 18 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది.
ఈ ప్లాన్ కొంతవరకు పనిచేసింది. అభిషేక్ శర్మ (0), హార్దిక్ పాండ్యా (0) వంటి హిట్టర్లను పాక్ స్పిన్నర్లు త్వరగానే అవుట్ చేశారు. అయితే, ఇషాన్ కిషన్ వీరోచిత ఇన్నింగ్స్ (40 బంతుల్లో 77 పరుగులు) కారణంగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
భారత్ బౌలింగ్ బలం: భారత బ్యాటింగ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలనుకున్న పాకిస్థాన్, టీమిండియా బౌలింగ్ శక్తిని తక్కువగా అంచనా వేసింది. బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్‌లతో కూడిన భారత బౌలింగ్ దళం పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది.
పవర్ ప్లేలోనే పతనం: 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. పవర్ ప్లే ముగియకముందే పాక్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఫర్హాన్ (0)ను పాండ్యా అవుట్ చేయగా.. కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా (4), సైమ్ అయూబ్ (6)లను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (5) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
స్పిన్ ఉచ్చులో పాక్: వేగంగా వికెట్లు పడటంతో పాకిస్థాన్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే పోరాడగా, మిగిలిన వారు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీయగా.. పాండ్యా, బుమ్రా కూడా రెండేసి వికెట్లు పడగొట్టారు. చివరికి 18 ఓవర్లలోనే పాకిస్థాన్ 114 పరుగులకు ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
