శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ‘ఇండియా’ (INDIA) కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై భారత జాతీయ కాంగ్రెస్ కూడా స్పందించింది.
సంజయ్ రౌత్ ఏమన్నారంటే? “లోక్సభ ఎన్నికలు దగ్గరపడినప్పుడే INDIA కూటమి పని మొదలవుతుంది. అప్పటి వరకు ఎవరి మధ్య చర్చలు జరగవు. కూటమిలోని నేతలు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. దేశంలో మణిపూర్ సమస్య, శాంతిభద్రతలు వంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కేవలం పార్లమెంటులో గొంతు ఎత్తితే సరిపోదు. అక్కడ రాహుల్ గాంధీని కూడా మాట్లాడనివ్వడం లేదు. మరి మనం బయట ఏం చేయగలం?” అని రౌత్ ప్రశ్నించారు.
ముఖ్యంగా అమెరికాతో జరిగిన ఒప్పందాల వల్ల దేశంలోని రైతులు ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల ముందే కాకుండా, కూటమి ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలని ఆయన సూచించారు. “కొందరు మమతా బెనర్జీ కూటమిని నడిపించాలని అంటున్నారు, మరికొందరు స్టాలిన్ పేరు చెబుతున్నారు. ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, కానీ కూటమి సమావేశం మాత్రం ఖచ్చితంగా జరగాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ స్పందన: సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పందిస్తూ.. “ఆయన ఒక సీనియర్ నాయకుడు. ఆయన ఏదైనా చెప్పారంటే, ఖచ్చితంగా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఆ విషయాన్ని గమనిస్తాయి. తదుపరి ఏం చేయాలనేది అందరూ కలిసి నిర్ణయిస్తారు” అని పేర్కొన్నారు.
